ఆదిలాబాద్‌లో రాజకీయ పార్టీలకు ఊపు.. కమలంలో జోష్.. చేరికలపై గులాబీ దృష్టి..

Political Heat In Adilabad District As All Parties Gained Momentum - Sakshi

వరుస కార్యక్రమాలతో బీజేపీలో జోష్‌

చేరికలపై టీఆర్‌ఎస్‌ దృష్టి

కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణంపై ఆసక్తి

అన్ని పార్టీల్లో నేతల మధ్య విభేదాలు

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్నట్టుగా ప్రధాన పార్టీల వ్యవహారాలు ఊపందుకున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నా యి. ఇటీవల వరుస కార్యక్రమాలతో కమలం పా ర్టీలో జోష్‌ కనిపిస్తోంది. ఇక గులాబీ పార్టీ చేరికలపై ప్రధాన దృష్టి సారించింది. విపక్షాలను ఢీలాపరిచే వ్యుహాలతో ముందుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లా పీఠం ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని పార్టీల్లో ముఖ్య నేతల మధ్య విభేదాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. 

ప్రజల్లోకి బీజేపీ..
ప్రజాగోస.. బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా కమలం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. గ్రామ గ్రామానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాలకు వివరించడంతో పాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల ఆదరాభిమానాలు పొందేందు కు యత్నిస్తోంది. ప్రధానంగా ముఖ్య నేతలను ని యోజకవర్గస్థాయిలో రంగంలోకి దించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం కలి గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ సభకు ముందు జిల్లాకు ఆ పార్టీ జాతీయ నేతలు రావడం, నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పుడు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ డేబ్‌ ఆదిలాబాద్‌కు, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ బోథ్‌ నియోజకవర్గాలకు వచ్చి రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి పార్టీ పరిస్థితిని సమీక్షించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నారు. 

చేరికలపై గులాబీ పార్టీ దృష్టి..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరుతూ ఆ పార్టీ ముఖ్య నాయకులు ఏ కార్యక్రమం జరిగినా వివరిస్తూ ముందుకెళ్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రధానంగా చేరికలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆదిలాబాద్‌ పట్టణంలో ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ పరిణామం బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యు ద్ధంగా మారింది. అధికార అహంకారంతో టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ కౌన్సిలర్లను ప్రలోభా లకు గురిచేస్తున్నారని కమలం పార్టీ ఆరోపిస్తుండగా, తాము చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసే పార్టీలోకి చేరుతున్నారని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్‌లో సంస్థాగత లొల్లి..
కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం చేపడతారనే వార్తల నేపథ్యంలో జిల్లా పార్టీలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భార్గవ్‌ దేశ్‌పాండే మధ్యలో వైదొలిగిన తర్వాత మైనార్టీసెల్‌ జిల్లా చైర్మన్‌గా ఉన్న సాజిద్‌ఖాన్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అతనినే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తారా.. లేనిపక్షంలో మార్పులు చేర్పులు ఉంటాయానేది పార్టీలో ఆసక్తికరంగా మారింది. అయితే జిల్లా అధ్యక్ష పదవిని పలువురు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 

అన్ని పార్టీల్లో విభేదాలు..
టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మూడు పార్టీల్లో జిల్లా ముఖ్య నేతల మధ్య తీవ్రస్థాయిలో విభేదా లు కొనసాగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ను ఆశిస్తున్న ఈ నేతలు ఎదుటి వారిపై పైచెయ్యి సాధించేందుకు తీవ్ర యత్నాలు     చేస్తున్నారు. 

బీజేపీలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసిని రెడ్డి మధ్య వైరం కొనసాగుతుంది. 

కాంగ్రెస్‌లో జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు సాజిద్‌ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి వయోభారంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినాఆయన ఆశీస్సులతో ఆ వర్గం నాయకులు ముందుకెళ్తున్నారు. మొత్తంగా పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉండగా, అందరినీ సమన్వయ పరుస్తూ ఒకే తాటికి తీసుకొచ్చే నేత ఆ పార్టీకి అవసరం ఉంది. 

ఇక అధికార టీఆర్‌ఎస్‌లో పోరు మరోలా ఉంది. జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బోథ్‌ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కొంతమంది ఎమ్మెల్యే బాపురావుకు వ్యతిరేకంగా కదులుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి.
చదవండి: కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలకలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top