
పౌరహక్కులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతల్లో సందేహాలు
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వ్యక్తిని పట్టుకుని కాల్చారా?
అనుక్షణం అప్రమత్తత, మూడంచెల భద్రత ఏమైంది?
ఫొటోలు లేవు.. ఫోన్లు, కెమెరాలకు అనుమతే లేదు
45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన వ్యక్తిని ఎలా గుర్తుపట్టారనే ప్రశ్నలు
బూటకపు ఎన్‌కౌంటర్ కాదంటున్న పోలీసు వర్గాలు
సాక్షి ప్రతినిది, భద్రాద్రి కొత్తగూడెం: సాయుధ పోరాటం ద్వారా విప్లవం సాధించాలని ప్రయత్నిస్తున్న అతి పెద్ద పార్టీగా దేశంలో గుర్తింపు ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు సామాజిక కార్యకర్తలు, పౌరహక్కులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో ప్రత్యక్షంగా, సామాజిక మాధ్యమాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్య కారణాలతో ఒడిశాలో రహస్యంగా చికిత్స పొందుతున్న నంబాలను పట్టుకుని ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అప్పట్నుంచీ ఒక్క ఫొటో కూడా లేదు
సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నప్పటి నుంచి నంబాల కేశవరావు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవాడని ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు, మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. తినడం, పడుకోవడం ఇలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకునేవాడని తెలుస్తోంది. అజ్ఞాత జీవితం గడిపే వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఫొటోలు, ఛాయా చిత్రాలు, ఇతర ఆనవాళ్లు బయట పడకుండా జాగ్రత్త పడాలని తోటి కామ్రేడ్లకు చెప్పేవాడని అంటున్నారు.
తాను స్వయంగా ఫోన్లకు దూరంగా ఉండటమే కాకుండా.. తాను ఉన్న ప్రదేశంలోనూ ఫోన్లు, కెమెరాలకు అనుమతి ఇచ్చేవాడు కాదని తెలుస్తోంది. ఈ కారణంగానే 45 ఏళ్ల అజ్ఞాత జీవితంలో ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఎంతో జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఎన్‌కౌంటర్‌కు గురి కావడం, 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లడమే కాకుండా కనీసం ఫొటోలు కూడా చూసిన దాఖలాలు లేని నేపథ్యంలో..వెనువెంటనే అతన్ని భద్రతా దళాలు గుర్తించడం సందేహాస్పదమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మూడే ఏకే 47లు ఎలా?
మావోయిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్న నంబాల కేశవరావుకు మూడంచెల భద్రత సర్వసాధారణంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వందకు పైగా, క్లిష్టమైన పరిస్థితులు ఉంటే కనీసం 70కి తక్కువ కాకుండా రక్షణ దళం ఉంటుందని, వీరిలో కనీసం 40 మంది ఏకే 47 వంటి తుపాకులు వినియోగిస్తారని ఆయనతో కలిసి పనిచేసిన మాజీ మావోలు చెబుతున్నారు. కానీ నారాయణపూర్ ఎన్‌కౌంటర్ ఘటనలో 27 మంది మావోయిస్టులు చనిపోగా 28 ఆయుధాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
ఇందులో ఏకే 47 తుపాకులు కేవ లం మూడే ఉన్నాయి. ఎస్‌ఎల్‌ఆర్‌లు 4, 303 రైఫిళ్లు 6, 12 ఇంచ్ బోర్ తుపాకులు 5, ఇన్సాస్‌లు 6, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు 3, కార్బన్ తుపాకీ 1 ఉన్నాయి. చనిపోయిన వారిలో నంబా ల, నవీన్, టిప్పులు డివిజన్ ఆ పైస్థాయి నేతలు గా ఉన్నారు. దీంతో మూడు ఏకే 47లు దొరికాయనుకున్నా, మాజీలు చెబుతున్నట్టు ప్రధాన కార్యదర్శికి రక్షణ కల్పించే దళానికి ఉండాల్సిన సంఖ్యలో అక్కడ ఏకే 47లు లభ్యం కాకపోవడాన్ని కొందరు ప్రస్తావిస్తుండటం గమనార్హం.
జనంలోకి రాబట్టే జుట్టుకు రంగు?
సాధారణంగా అజ్ఞాత జీవితం గడిపే మావోయిస్టులు పొదుపుగా వనరులు ఉపయోగిస్తుంటారు. పాలు, చక్కెర, టీపొడి వంటి నిత్యావసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ నంబాల కేశవరావు హెయిర్ డై వాడినట్టుగా ఫొటోల్లో కనిపించడం అసాధారణంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అనారోగ్య సమస్యల కారణంగా అజ్ఞాతం వీడి జనబాహుళ్యంలోకి నంబాల వచ్చారని, అందువల్లే బయట పరిస్థితులకు తగ్గట్టుగా హెయిర్ డై వాడటం, క్లీన్ షేవ్ చేసుకోవడం వంటివి జరిగి ఉండవచ్చని అంటున్నారు. అయితే రహస్యంగా చికిత్స పొందుతున్న అంశంపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు చాకచక్యంగా దాడి చేసి పట్టుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
డీఆర్‌జీ బలగాల పనేనా?
నారాయణపూర్ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్‌జీ) బలగాలు పాల్గొన్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే.. జంగిల్ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందిన కోబ్రా బలగాలు, యుద్ధతంత్రాల్లో ఆరితేరిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, ఆధునిక ఆయుధాలు ఉపయోగించే సీఆర్‌పీఎఫ్ జవాన్లతో సాధ్యం కానిది కేవలం నాలుగు జిల్లాలకు చెందిన మాజీ మావోలతో కూడిన డీఆర్‌జీ బలగాలు మావోయిస్టు చీఫ్‌ను ఎన్‌కౌంటర్ చేయడం ఎలా సాధ్యమైందనే వాదన విన్పిస్తోంది.
అయితే మావోయిస్టు పార్టీ చీఫ్‌ను పట్టుకునేందుకు దశాబ్దాల తరబడి శ్రమిస్తున్నామని, వందలాది మంది పోలీసులు నిరంతరం ఇదే పనిలో ఉన్నారని, చివరకు తమ కష్టం ఫలించి నంబాల ఆచూకీ తెలుసుకున్నామని, లొంగిపోమ్మని చెబితే వినకుండా కాల్పులు జరపడం వల్లే ఎన్‌కౌంటర్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారని, చాలామంది మావోయిస్టులు ఘటనా స్థలి నుంచి తప్పించుకున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి.
గోప్యత ఎందుకు: విరసం
నంబాల కేశవరావు మరణం, పోస్టుమార్టం, భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించే విషయం.. ప్రతిచోటా పోలీసులు గోప్యతను ఎందుకు పాటిస్తున్నారో అర్థం కావటం లేదని విప్లవ రచయితల సంఘం (విరసం) పేర్కొంది. భౌతికకాయం కోసం గురువారం జగదల్‌పూర్‌కు వెళ్లిన కేశవరావు సోదరులను దూరం నుంచే పోలీసులు వెనక్కు పంపించారని తెలిపింది. దీనివెనుక ఉద్దేశం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది.