మిర్యాలగూడలో ముగ్గురు సజీవ దహనమైన కేసును ఛేదించిన పోలీసులు
తనను దూరం పెట్టిందనే కోపంతో ఘాతుకానికి పాల్పడ్డ రెండో భర్త
మిర్యాలగూడ అర్బన్: చిన్నతనంలోనే వివాహం.. అంతలోనే ఇద్దరు పిల్లలు. తాగుడుకు బానిసైన భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. తోడుంటాడని నమ్మి రెండో పెళ్లి చేసుకుంటే.. అతనే కన్నపిల్లలను, ఆమె తల్లిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఉదంతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది. మిర్యాలగూడ పట్టణంలోని కలల్‌వాడ కాలనీలో ఈనెల 5న రాత్రి సుమారు 2 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో వనం చంద్రమ్మ అలియాస్ చంద్రకళ (50), ఆమె మనువడు నక్కా లక్ష్మణ్ (16), మనవరాలు నక్కా ప్రణతి (14) సజీవ దహనమైన సంగతి తెలిసిందే.
ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సేకరించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు జరిపిన లోతైన విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్‌తో పెట్రోల్ పోసి తగలబెట్టి ప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు. చంద్రకళ కుమార్తె ధనమ్మ మొదటి భర్త తాగుడుకు బానిసై అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న ధనమ్మకు వివాహ వేదిక యాప్ ద్వారా కారు డ్రైవర్ అయిన కాళహస్తి శిరీశ్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ 2023లో నరసరావుపేటలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.
కలల్‌వాడలో ఇల్లు నిర్మించుకునే క్రమంలో వీరి మధ్య ఆర్థిక పరమైన గొడవలు రావడంతో శిరీశ్ కుమార్‌ను ధనమ్మ దూరం పెట్టింది. మరోవైపు శిరీశ్ కుమార్ వివాహ వేదిక యాప్ ద్వారానే మరో మహిళను నమ్మించి, బంగారం లాక్కుని మోసం చేయడంతో మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై మే నెలలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. జైలు నుంచి విడుదలయ్యాక ధనమ్మపై కోపం పెంచుకున్నాడు. ధనమ్మ తండ్రి చనిపోవడంతో పిల్లలను తల్లి చంద్రమ్మ వద్ద ఉంచి, బతుకుదెరువు కోసం ఇటీవల పుణేలో కేర్‌టేకర్‌గా పనికి వెళ్లింది.
ఇంట్లో ధనమ్మ లేని సమయం చూసి, ఈనెల 5న అర్థరాత్రి శిరీశ్ కుమార్ ఓ క్యాన్‌లో పెట్రోల్ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. గాఢనిద్రలో ఉన్న చంద్రమ్మ, పిల్లలు లక్ష్మణ్, ప్రణతిలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ క్రమంలో నిందితుడి చేతికి కూడా మంటలు అంటుకుని కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. ధనమ్మ ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు కాళహ స్తి శిరీశ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


