హసీనా సోదరి అల్లుడే ప్రధాన నిందితుడు
యూట్యూబ్‌లో చూసి పక్కా స్కెచ్‌తో మర్డర్
వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నల్లగొండ: నల్లగొండలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహ్మత్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, కుమారుడు ముజమిల్, కుమార్తె అక్సరల హత్యకేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆ వివరాలు వెల్లడించారు. మృతురాలు హసీనా అక్క కూతురు తబస్సుమ్ భర్త అస్లాం.. హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పుల్లో కూరుకుపోయాడు. హసీనా వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. ఇంకా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది.
ఇదే క్రమంలో మరో రూ.లక్ష అప్పు అడగ్గా హసీనా ఇవ్వలేదు. దీంతో అస్లాం, ఆయన భార్య తబస్సుమ్‌లు హసీనాపై కక్ష పెంచుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్న హసీనా సొంత కూతురు వద్దకు వెళ్లి తల్లి మీద కక్ష పెంచేలా కల్పించి చెప్పారు. హసీనా కుటుంబ సభ్యులను హత్య చేస్తే.. నింద సొంత కూతురిపై పడుతుందని, ఆస్తినంతా దోచుకోవచ్చని అస్లాం, తబస్సుమ్ భావించారు. దీని కంటే ముందుగా దొంగతనం చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 28న అస్లాం, అతని స్నేహితుడు సోహెల్ హసీనా ఇంట్లోకి ప్రవేశించగా, ఏమీ దొరకలేదు. ఇదే క్రమంలో అస్లాంకు ఆర్థిక సమస్యలు పెరగడంతో హసీనాను చంపి ఆమె వద్ద డబ్బు, బంగారం దోచుకోవాలని పన్నాగం పన్నాడు.
యూట్యూబ్‌లో చూసి...
నేరానికి ముందు అస్లాం యూట్యూబ్‌లో హత్య చేసి ఎలా తప్పించుకోవాలి.. శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయో చూసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పథకం సిద్ధం చేసుకున్నట్టు విచారణలో తేలింది. జూన్ 19న హైదరాబాద్‌లోని గండిపేట నుంచి రాత్రి 7 గంటలకు తన కారులో నల్లగొండకు చేరుకున్నాడు. హసీనా భర్త అయిన సుల్తాన్‌కు ఫోన్ చేసి.. కిరాయి పని మీద నల్లగొండకు వచ్చానని, రాత్రి 11 గంటల వరకు వస్తానని చెప్పగా సుల్తాన్‌తోపాటు హసీనా కూడా స్పందించలేదు. దీంతో నల్లగొండ శివారులో వేచి ఉండి రాత్రి 2 గంటలకు హసీనా ఇంటి గోడ దూకి ఇంట్లో దాక్కున్నాడు.
తెల్లవారుజామున 5 గంటలకు హసీనా వాష్‌రూమ్ కోసం ఇంటి డోర్ తీసుకొని బయటకు వస్తుండగా గుమ్మం వద్ద దాక్కున్న అస్లాం..కత్తితో ఆమె మెడపై దాడి చేయగా, కేకలు వేస్తూ పడిపోయింది. ఆ కేకలు విని వచ్చిన భర్త సుల్తాన్ ఆ సంఘటన చూసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుండగా అస్లాం పట్టుకొని సుల్తాన్ మెడపై ఒక్కసారి దాడి చేశాడు. ఇది చూసిన సుల్తాన్ కుమారుడు ముజమిల్ భయంతో నిద్రలేచి పారిపోతుండగా అతనిపై కూడా దాడి చేశాడు.
ఈ క్రమంలో ముజమిల్ ఇనుప రాడ్‌తో ప్రతి దాడి చేయగా అస్లాం ఎడమ చేయి, చూపుడు వేలికి గాయమైంది. దీంతో ముజమిల్‌ను కత్తితో పొడిచాడు. దీంతో అతడు కూడా రక్తపు మడుగులో పడిపోయాడు. అస్లాం ముగ్గుర్ని హత్య చేశాడు. ఈ హత్యలను అక్సర చూడగా, ఆ బాలిక బతికుంటే సాక్ష్యంగా మారుతుందని భావించి అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. నలుగురు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం అస్లాం ఐదు తులాల బంగారు ఆభరణాలు, నగదు, భూమి, బ్యాంకు పత్రాలు తీసుకొని హైదరాబాద్‌కు పరారయ్యాడు.
దొంగిలించిన బంగారాన్ని తన స్నేహితుడి సాయంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక జ్యూయలరీ షాపులో కరిగించి తాకట్టు పెట్టి రూ.5.30 లక్షలు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు అస్లాం, ఆయన భార్య తబస్సుమ్, స్నేహితుడు సోహెల్‌తోపాటు బంగారాన్ని తీసుకున్న హేమంత్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 5 తులాల కరిగించిన బంగారపు ముద్ద, కారు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల్లోనే నేరస్తులను పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు.


