చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి | Police Break Down Woman Death Mystery In Hanumakonda | Sakshi
Sakshi News home page

చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:35 AM

Police Break Down Woman Death Mystery In Hanumakonda

హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో అదృశ్యమైన మహిళ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిన మహిళను తన స్వగ్రామానికి రప్పించి నిందితుడు హత్య చేశాడు. ఈ మేరకు హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ వెల్లడించారు. ఆయన కథన ప్రకారం హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన తౌటం స్వప్న (40).. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గత మే 31న తన కూతురు కనిపించడం లేదని తండ్రి ఆమంచ రాజేందర్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

స్థానిక పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను సేకరించి విచారణ చేపట్టి కేసును ఛేదించారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారి జిల్లా గుడుదూరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్‌ వొద్దిరాజుల బసవరాజ్‌ అనే యువకుడితో స్వప్నకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని స్పప్న బెదిరింపులకు పాల్పడింది. అలా అయితే తన పరువు పోతుందని స్వప్న ఇష్టానుసారం పెళ్లికి బసవరాజ్‌ అయిష్టంగా అంగీకరించాడు. ఆమెను ఇక్కడి నుంచి బళ్లారికి రప్పించాడు. 

అనంతరం స్థానిక గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోకి స్వప్నను తీసుకెళ్లి హత్య చేశాడు. హత్యను దాచిపెట్టేందుకు మరుసటి రోజు మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసి, రక్తపు మరకలు ఉన్న బట్టలను తగులబెట్టాడు. స్వప్న మొబైల్‌ను చెరువులో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. అంబాల–కమలాపూర్‌ ప్రధాన రోడ్డులో తాజాగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులను చూసి బసవరాజ్‌ పరారయ్యే క్రమంలో అదుపులోకి తీసుకుని విచారించారు. స్పప్నను తనే హత్యచేశానని అంగీకరించగా బసవరాజ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ మహేందర్, ఎస్సైలు సుజిత్, రవి, దేవేందర్, ఏఓ సల్మాన్‌ పాషా, సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు. 

ఇదీ చదవండి:  కేపీహెచ్‌బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement