ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ

PM Narendra Modi Says BJP govt fully supports SC classification - Sakshi

మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ హామీ

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుంది

ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.. న్యాయపరమైన చిక్కులు అధిగమించేందుకు చర్యలు చేపడతామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోరిక అత్యంత న్యాయమైనదని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తా­మని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) చేస్తున్న ఉద్యమం సరైనదని, త్వరలో మాదిగల ఆకాంక్షను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాదిగ ఉప కులాల ఉద్యమానికి బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉందని, ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు.

ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఎస్సీ జాబితాలో ఉన్న కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికే కట్టుబడి ఉందని చెప్పారు. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతే తమ  లక్ష్యమన్నారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు కొనసాగించనున్నట్లు తెలిపారు.

తెలుగు కవి గుర్రం జాషువా కవితల ప్రేరణతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని, వన్‌ లైఫ్‌.. వన్‌ మిషన్‌లా చేస్తున్న ఈ ఉద్యమం స్పూర్తినిచ్చిందని తెలిపారు. తెలంగాణలో దళితులకు బీఆర్‌ఎస్‌ తీరని అన్యాయం చేసిందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటిరోజే దళిత ముఖ్యమంత్రి హామీని తొక్కేశారని, సీఎం కుర్చీని కేసీఆర్‌ కబ్జా చేశారని అన్నారు.

దళితబంధు అంటూ వేలకోట్ల రూపాయలను వారి పార్టీ నేతల విధేయులు, కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ దళితులను ఎన్నోరకాలుగా అవమానపర్చిందని, అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిందని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్‌ వేధించిందన్నారు.

మా ఆకాంక్షలు నెరవేర్చేది మోదీయే: మంద కృష్ణ
దళితుల ఆకాంక్షలు నెరవేర్చేది ప్రధాని మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరని మండిపడ్డారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కూడా పరిష్కరించాలని మోదీని కోరుతున్నానంటూ మంద కృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ మంద కృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top