
గ్రామ పంచాయతీ కార్మికుడి కుమారుడి ప్రతిభ
దాతల సహకారంతో ఐఐటీలో చేరి స్టార్టప్ కంపెనీ నెలకొల్పిన తుమ్మలపెన్‌పహాడ్ యువకుడు
నేటి యువతకు స్ఫూర్తిగా పిడమర్తి అనిల్‌కుమార్
నల్గొండ: పట్టుదల, అంకితభావం, కష్టపడేతత్వం ఉంటే చాలు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించాడు మారుమూల గ్రామీణ ప్రాంతంలోని కూలీ కుటుంబంలో జన్మించిన యువకుడు. పేద కుటుంబంలో పుట్టినా దాతల సహకారంతో ఐఐటీలో చదివి.. స్టార్టప్ కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగాడు ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి అనిల్‌కుమార్. బాల్యం నుంచి తల్లిదండ్రుల కష్టాలు చూసి పెరిగిన అనిల్‌కుమార్ అడుగడుగునా ఎదురైన ఆటంకాలను అధిగమించి జీవితంలో సక్సెస్ అయ్యాడు.
ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు సునీల్‌కుమార్, అనిల్‌కుమార్ సంతానం. ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు. కవిత దినసరి కూలీ. వారికి పెద్దగా ఆస్తులు లేవు. అనిల్‌కుమార్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద హుజూర్‌నగర్‌లోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్‌లో ప్రవేశ పరీక్ష రాసి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. పదో తరగతి తర్వాత హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(ఐఐటీ అకాడవీు)లో ప్రవేశ పరీక్ష రాసి ఇంటర్‌తో పాటు ఐఐటీ కోచింగ్ తీసుకునేందుకు సీటు సాధించాడు.
ప్రభుత్వ కళాశాలలో ఐఐటీ స్థాయి కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన నాటి గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్ఫూర్తితో అనిల్‌కుమార్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సంపాదించాడు. అయితే ఏడాదికి దాదాపు లక్షన్నర రూపాయల ఫీజు చెల్లించాల్సి రావడం ఆ కుటుంబానికి భారంగా మారింది. పైగా అనిల్‌కుమార్ అన్న సునీల్‌కుమార్ కూడా అదే సమయంలో బీటెక్ చదువుకుంటుండడంతో ఇద్దరికి ఫీజు చెల్లించడం వారి తల్లిదండ్రులకు భారంగా మారింది.
దాతల సాయంతో ఐఐటీకి..
ఈ నేపథ్యంలో సాక్షి దినపత్రికలో 2021 డిసెంబర్ 12న అనిల్‌కుమార్ పరిస్థితిపై ‘అట్టడుగు నుంచి ఐఐటీకి’ అనే కథనం ప్రచురించడంతో దాతలు ముందుకు రావడంతో పాటు అప్పటి సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్, ఇతరుల నుంచి ఆర్థిక సాయం లభించింది. అంతేకాకుండా అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం రూ.2.50లక్షలు చెక్కు అనిల్‌కుమార్‌కు అందించడంతో ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు దోహదం పడింది. తనకు అందివచి్చన అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్న అనిల్‌కుమార్ కష్టపడి చదివి ఈ నెల 15వ తేదీన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన 71వ స్నాతకోత్సవంలో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్ చేతులమీదుగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు.
కేటీఆర్ మాటలే ప్రేరణగా...
‘మనం ఒకరి కింద ఎందుకు పనిచేయాలి..? మనం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేం..? మనం కంపెనీలను ఎందుకు ప్రారంభించకూడదు..?’ అని మాజీ మంత్రి కేటీఆర్ మాటలతో ప్రేరణ పొందిన అనిల్‌కుమార్ ఐఐటీలో చదువుతుండగానే తన మిత్రులతో కలిసి లూప్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను స్థాపించాడు. ఈ స్టార్టప్ ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ కంపెనీ అభివృద్ధికి పాటుపడుతున్నాడు.
అనిల్‌కుమార్ స్టార్టప్ కంపెనీని నెలకొల్పడంతో మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు స్టార్టప్ కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మరిన్ని విజయాలు సాధించాలి. ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారండి’ అని కేటీఆర్ అనిల్‌కుమార్ విజయ ప్రస్థానంపై ఎక్స్(ట్విటర్)లో అభినందనలు తెలిపారు.