హైదరాబాద్‌లో ఒక్కో ప్రయాణికుడు ట్రాఫిక్‌లో గడిపే సమయమిది
10 కి.మీ. దూరానికి పట్టే సమయం 31.30 నిమిషాలు
ట్రాఫిక్ జామ్‌కు అధ్వాన రోడ్లు, వాహనాల రద్దీ, ఉల్లంఘనలు వంటి కారణాలెన్నో..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ. ఏడాదిలో మనం ట్రాఫిక్‌లో గడిపే సమయం ఎంతో తెలుసా? 85 గంటలు. నగరంలో 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాల 30 సెకన్లు. అయితే బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే ట్రాఫిక్ రద్దీలో గడిపే సమయం మన దగ్గరే తక్కువ కావడం కాస్త ఊరట కలిగించే అంశం. వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ట్రాఫిక్ క్రమశిక్షణ లేకపోవడం, అధ్వానమైన రహదారులు, ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగకపోవడం వంటివి హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాలు.
కి.మీ.కు 9,500 వాహనాలు
ట్రాఫిక్ సంక్షోభం కూడా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా పరిణమించింది. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి ఉండే మహా నగరాలు.. ఇప్పుడు కాలుష్య కారకాలుగా మారాయి. దేశంలో అత్యంత రద్దీ కలిగిన ఆరో నగరంగా హైదరాబాద్ అవతరించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 85 లక్షలకు పైగా వ్యక్తిగత వాహనాలున్నాయి. కిలోమీటరుకు దాదాపు 9,500 వాహనాల సాంద్రత ఉంది. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యాలయాలు, విద్యాసంస్థల పనివేళల్లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న సమయాన్ని పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు. ఆ సమయంలో వాహనాల సగటు వేగం చాలా తక్కువగా ఉంటుంది. 2024 ప్రారంభంలో వాహనాల సగటు వేగం గంటకు 18 కి.మీ.గా ఉంది. ఇందులోనూ ఉదయం రద్దీ సమయంలో వాహనాల వేగం గంటకు 17.8 కి.మీ.గా ఉండగా.. సాయంత్రం వేళల్లో గంటకు 15.6 కి.మీ.కు తగ్గింది.
ప్రధాన ట్రాఫిక్ హాట్‌స్పాట్లు
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం, ఎల్బీనగర్, ఉప్పల్
ఏం చేయాలంటే..
–ప్రతీ చిన్న అవసరానికి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలి.
–రోడ్లపై వాహనాలు సజావుగా సాగేలా అక్రమ పార్కింగ్‌లను తొలగించాలి.
–ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
–ఆర్టీసీ బస్‌లు, ఎంఎంటీఎస్, మెట్రో వంటి ప్రజా రవాణాను విరివిగా వినియోగించాలి.
–చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి.
–అత్యవసరమైతే తప్ప పీక్ అవర్స్‌లో ప్రయాణం చేయొద్దు.
–నావిగేషన్ యాప్‌లను వినియోగిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం.


