
విడతల వారీ పాదయాత్రలో సీఎం, డిప్యూటీ సీఎం సైతం పాల్గొంటారు
కేడర్‌లో ఆత్మవిశ్వాసం కోసమే రేవంత్ ‘పదేళ్లపాటు సీఎం’ వ్యాఖ్యలు
తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారు.. అదీ కాంగ్రెస్ పార్టీలోనే
మీడియాతో ఇష్టాగోష్టిలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: జనహిత పాదయాత్ర నిర్వహించాలనుకున్నది తానేనని.. తమ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కొందరు కావాలనే దాన్ని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేశారన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ నెల 23 తర్వాత జనహిత పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామన్నారు.
విడతలవారీగా జరిగే ఈ పాదయాత్రలో వీలు, సమయాన్ని బట్టి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. తొలివిడత పాదయాత్రలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా కనిపించారన్నారు.
4–5 రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించనక్కర్లేదని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. కేబినెట్ తీర్మానాలు, అసెంబ్లీలో బిల్లులు, కులగణన లాంటి వ్యవహారాలు ఆషామాషీగా జరగవని.. ప్రజలన్నీ అర్థం చేసుకుంటారన్నారు.
ఢిల్లీలో తాము నిర్వహించిన ధర్నాకు రాహుల్, ఖర్గే రాకపోవడానికి షెడ్యూల్ కుదరకపోవడమే కారణమన్నారు. నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారని.. అది కూడా తమ పార్టీలోనే కచి్చతంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
మా మధ్య విభేదాల్లేవు
సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య విభేదాలున్నట్లు కొందరు విషప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం లేదని మహేశ్‌గౌడ్ వివరించారు. సీఎంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అలా ఉండబట్టే బీసీ రిజర్వేషన్లపై ఇంతవరకు పోరాడగలిగామని చెప్పారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసమే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు.
గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసినప్పుడు.. ప్రస్తుతం సీఎంగా పనిచేస్తున్నప్పుడు రేవంత్‌రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డిల అంశాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందన్నారు.
జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ విజయం నల్లేరుపై నడకేనని మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అవకా శం ఇచ్చే సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది కేసీఆరేనని.. తాము జూబ్లీహిల్స్‌లో తప్పక పోటీ చేస్తా మ ని చెప్పారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాగానే అభ్యర్థి ని ప్రకటిస్తామని మహేశ్‌కుమార్‌గౌడ్‌చెప్పారు.