అన్నీ కుదిరితే అవకాశం ఉన్నదని ఊహాగానాలు
24న హైకోర్టులో విచారణ
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని చెప్పనున్న రాష్ట్ర ప్రభుత్వం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఆయా శాఖలు, విభాగాల పరంగానూ సన్నాహాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో ఈ నెల 26న గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. గ్రామ పంచాయతీల్లో 50 శాతానికి లోబడి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ.. గురు లేదా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించనున్నట్టు అధికారవర్గాల సమాచారం.
ఈ నివేదిక అందగానే దానిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు అందజేసి, వెంటనే జిల్లాల్లో ఆయా పంచాయతీల వారీగా జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఆదేశించనుంది. ఆ వెంటనే రెండురోజుల్లోనే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎండీఓలు పంచాయతీల వారీగా రిజర్వేషన్లను రెడీ చేస్తారు. ఒకవేళ 26న ఈ షెడ్యూల్ విడుదలైన పక్షంలో డిసెంబర్ 2, 3 వారాల్లోగా లేదా ఎక్కువలో ఎక్కువగా డిసెంబర్ 20–25వ తేదీల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
మూడువిడతల్లో నిర్వహించే ఈ ఎన్నికలను మూడేసి రోజుల అంతరంతో నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెల 24న హైకోర్టులో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారన్న దానిపై తదుపరి విచారణ జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24న లేదా ఆ లోగానే ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయనున్నట్టు అధికారవర్గాల సమాచారం. కోర్టు చేసే సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సిద్ధంగా ఉన్నాయి.
ఓటర్ల జాబితాలపై ఎస్‌ఈసీ ఆదేశాలు
తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కేబినెట్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎస్‌ఈసీ కూడా ఎన్నికల సన్నాహాల్లో వేగం పెంచింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం కాగా... గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని, గతంలో ప్రచురించిన జాబితాలోని లోపాలను వెంటనే సరిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. ఈ ఏడాది జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించి, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా.. గత సెపె్టంబర్ 2న వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదాను ప్రకటించారు.
అందులో ఓటర్లు ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడం, మ్యాపింగ్‌లో తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని తాజా ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ సూచించారు పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం.. ఓటర్ల జాబితాను పరిశీలించి, వార్డుల వారీగా ఓటర్లను రీ–అరేంజ్ చేసి మళ్లీ ప్రచురించాలని డీపీఓలను ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తవ్వగానే.. ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. 31 జిల్లాల్లో 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం ఈ మేరకు ఎస్‌ఈసీ ఓ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డీపీఓలను ఎస్‌ఈసీ ఆదేశించింది.
గ్రామపంచాయతీల్లో ఓటర్ల జాబితా
రీ–పబ్లికేషన్‌కు సంబంధించిన దశలు ఇలా...
ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వార్డుల మ్యా పింగ్‌లో తప్పుల సవరణ (అడ్రస్‌లో మార్పు లేకుండా కేవలం వార్డు మార్పులు మాత్రమే) అవకాశం కల్పించింది.
గురువారం.. సెప్టెంబర్ 2న జీపీ/వార్డు/పోలింగ్‌స్టేషన్ వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల్లో మిస్ మ్యాపింగ్‌పై ఓటర్ల నుంచి దరఖాస్తు స్వీకరణ, వాటి పరిశీలన
22వ తేదీన అందిన ఫిర్యాదులు, అభ్యర్థనలు, అభ్యంతరాలను సంబంధిత డీపీఓల ద్వారా పరిష్కారం
23వ తేదీన సంబంధిత గ్రామపంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాల రీ–పబ్లికేషన్, అదే రోజు మారిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను తిరిగి ప్రచురించాలి


