పన్ను బకాయా.. ‘సెటిల్‌మెంట్‌’ చేస్కోండి

OTS Scheme To Recover Rs 3000 Crore Pending Taxes In Telangana - Sakshi

రూ. 3 వేల కోట్ల పెండింగ్‌ పన్నులు రాబట్టేందుకు ఓటీఎస్‌ పథకం 

సాధారణ పన్నులో 60%.. వ్యాట్‌ అయితే 50% మాఫీ 

వివాదాల్లో ఉన్న వాటికే రాయితీలు వర్తింపు

ఈ నెల 16 నుంచి 30 వరకు దరఖాస్తుకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రూ. 3 వేల కోట్లకు పైగా పన్నులను రాబట్టేందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ జనరల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ యాక్ట్‌–1957, తెలంగాణ వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌–2005, సెంట్రల్‌ ట్యాక్స్‌ యాక్ట్‌–1956, తెలంగాణ ఎంట్రీ ఆఫ్‌ గూడ్స్‌ ఇన్‌టు లోకల్‌ ఏరియాస్‌–2001 చట్టాల పరిధిలోకి వచ్చే పన్నుల చెల్లింపునకు సంబంధించి పన్నుల శాఖతో వివాదం ఉంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. వివాదాల్లో ఉన్న పన్ను చెల్లింపులకు సంబం ధించి సాధారణ పన్నులో 60 శాతం మాఫీ కానుంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) 50 శాతం, ఎంట్రీ ట్యాక్స్‌ 40 శాతం మాఫీ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పన్నులను 100 శాతం కట్టాల్సి ఉంటుంది. అయితే వీటిపై వేసిన జరిమానాలు, వడ్డీలు రద్దవుతాయి.

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యాపారి సదరు మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం రూ.25 లక్షల కంటే ఎక్కువుంటే 4 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశమిస్తారు. ఈ వాయిదాల వరకు వడ్డీలు ఉండవు. 4 కన్నా ఎక్కువ వాయిదాలైతే పెంచిన వాయిదాల కు బ్యాంకు వడ్డీ వర్తిస్తుంది. పథకం కింద ఈ నెల 16 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను జూలై 1 నుంచి 15 వరకు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీకి సర్కిల్‌ ఏసీ, డీసీ, జేసీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీదే తుది నిర్ణయం. మాఫీ పోను మిగిలిన సొమ్మును అదే నెల 16 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top