‘ఒరిజినల్‌ ఆధార్‌’ తప్పనిసరి.. | Sakshi
Sakshi News home page

‘ఒరిజినల్‌ ఆధార్‌’ తప్పనిసరి..

Published Tue, Jan 9 2024 12:43 AM

Original Aadhaar mandatory For Free RTC Bus Travel For Women - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని మహిళలు వినియోగించు కోవాలంటే ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. గుర్తింపుకార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్‌ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్‌ కార్డు అయినా సరే ఈ పథకానికి వర్తిస్తుందని ఆయన ‘ఎక్స్‌’వేదికగా సోమవారం పోస్టు చేశారు. అయితే పాన్‌కార్డు మాత్రం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. పాన్‌కార్డుపై అడ్రస్‌ ఉండదని, అందువల్ల ఆ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు.

ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా..ఇప్పటికీ కొంతమంది స్మార్ట్‌ ఫోన్‌లో ఫొటో కాపీలు, కలర్‌ జీరాక్స్‌ చూపిస్తున్నారన్న విషయం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్‌ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్‌ తీసుకోవాలని కోరారు. ఒరిజినల్‌ గుర్తింపుకార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 

వాదనలకు దిగొద్దు... 
’ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం’అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని ఇది సరికాదని ఆయన తెలిపారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని చెప్పారు. జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వారవుతారని వివరించారు. అందువల్ల ప్రతి మహిళ జీరోటికెట్‌ తీసుకోవాలని. ఒకవేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. అలాగే సదరు మహిళ నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తారని సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.   

Advertisement
Advertisement