హైదరాబాద్‌–బెంగళూరు సెక్షన్‌లో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌

Optical Fibre Cable Hyderabad Bangalore Highway: Minister Nitin Gadkari - Sakshi

512 కిలోమీటర్ల మేర నిర్మాణానికి ఆమోదం

కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌–బెంగళూరు సెక్షన్‌లో 512 కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) ఏర్పాటు పనులకు ఆమోదం తెలిపామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను గతేడాది సెప్టెంబర్‌ 23న మంజూరు చేసినట్టు బీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి తెలిపా రు.

ఇప్పటికే  ఢిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్‌–బెంగళూరు హైవే వెంట మొత్తం 1880 కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ఏర్పాటు చేసే రెండు పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఈ రెండు–పైలట్‌ ప్రాజెక్ట్‌ల అనుభవం, సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఫలితాల ఆధారంగా, దేశంలోని జాతీయ రహదారి (గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్‌ రెండూ) నెట్‌వర్క్‌ కోసం ఓఎఫ్‌సీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. 

619 సీఎన్జీ కేంద్రాలు లక్ష్యం
తెలంగాణలో మొత్తం 619 సీఎన్జీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మినిమం వర్క్‌ ప్లాన్‌ (ఎండబ్ల్యూపీ) లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌ 30వ తేదీ నాటికి రాష్ట్రంలో 134 సీఎన్జీ కేంద్రాలున్నాయని బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధికంగా 88 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కనీసం ఒక్క సీఎన్జీ కేంద్రం లేదని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top