breaking news
Hyderabad Bangalore
-
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్‌లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
హైదరాబాద్–బెంగళూరు సెక్షన్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–బెంగళూరు సెక్షన్లో 512 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) ఏర్పాటు పనులకు ఆమోదం తెలిపామని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను గతేడాది సెప్టెంబర్ 23న మంజూరు చేసినట్టు బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి తెలిపా రు. ఇప్పటికే ఢిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్–బెంగళూరు హైవే వెంట మొత్తం 1880 కిలోమీటర్ల పొడవునా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేసే రెండు పైలట్ ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఈ రెండు–పైలట్ ప్రాజెక్ట్‌ల అనుభవం, సాధ్యాసాధ్యాల అధ్యయనాల ఫలితాల ఆధారంగా, దేశంలోని జాతీయ రహదారి (గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ రెండూ) నెట్వర్క్ కోసం ఓఎఫ్సీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. 619 సీఎన్జీ కేంద్రాలు లక్ష్యం తెలంగాణలో మొత్తం 619 సీఎన్జీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మినిమం వర్క్ ప్లాన్ (ఎండబ్ల్యూపీ) లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి రాష్ట్రంలో 134 సీఎన్జీ కేంద్రాలున్నాయని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధికంగా 88 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కనీసం ఒక్క సీఎన్జీ కేంద్రం లేదని వెల్లడించారు. -
మహానగరికి బెంగళూరు పాఠం
హైదరాబాద్- బెంగళూరు రెండు మహానగరాలు. ఎన్నో అంశాల్లో రెండింటికీ దగ్గర పోలికలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో పోటీ పడుతున్నాయి. ‘టీ-హబ్’ ఏర్పాటుతో అనేక స్టారప్లు ఇటువైపు ఆసక్తి చూపుతున్నాయి. కొద్దికాలంలోనే భాగ్యనగరం ఐటీలో బెంగళూరును అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, అధిక అభివృద్ధి వల్ల బెంగళూరులో తలెత్తిన సమస్యలు పరిష్కరించలేని స్థితి ఏర్పడింది. అలాంటి సమస్యే ఇక్కడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కోకుంటే ట్రాఫిక్, మౌలిక సదుపాయాల విషయంలో ‘గ్రేటర్’ మరో బెంగళూరు కాగలదని హెచ్చరిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో రెండు నగరాల మధ్య పోలిక.. ఆధునిక బెంగళూరుకు 1537 పునాది పడింది. హైదరాబాద్ కూడా దాదాపు అదే సమయంలో (1592) ఏర్పడింది. బెంగళూరు ఐటీ రంగంలో ముందంజలో ఉంటే హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. ప్రస్తుతం బెంగళూరు మెట్రో జనాభా కోటి పదిహేను లక్షలు. ఈ సంఖ్య 2001లో 51 లక్షలు ఉంటే పద్నాలుగేళ్లలో రెండింతలు దాటింది. హైదరాబాద్ ప్రస్తుత జనాభా దాదాపు కోటి. వాతావరణంలో అనుకూలంతో పాటు, ప్రభుత్వ ప్రోత్సాహంతో బెంగళూరు.. చెన్నై, హైదరాబాద్ కంటే శరవేగంగా అభివృద్ధి చెందింది. భయపెడుతున్న ట్రాఫిక్.. సాఫ్ట్వేర్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా రావడంతో బెంగళూరులో ఉద్యోగుల సంఖ్య అమాంతం పెరిగింది. ప్రజల ఆర్థిక స్థాయి సైతం మెరుగుపడింది. వీటివెంటే నగరంలో లక్షల సంఖ్యలో వాహనాలు పెరిగిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్‌లు తప్పనిసరైంది. ఫ్లై ఓవర్లు, వన్ వే పద్ధతి అమలు చేసినా సమస్య అలాగే ఉంది. అభివృద్ధి పేరిట నగరం మొత్తం నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు రోడ్ల విస్తరణ అధికారులకు కత్తిమీద సామైంది. నగరంలో సరిపడినంత స్థలం లేకపోవడంతో సాఫ్ట్వేర్ కంపెనీలు శాఖల ఏర్పాటుకు మైసూర్, అనంతపురం వంటి చిన్న పట్టణాలను ఎంచుకుంటున్నాయి. పెరుగుతున్న వాహనాలు.. ఐటీ, బీపీఓ వంటి ప్రైవేట్ పరిశ్రమలు వందల కొద్దీ బెంగళూరుకు రావడంతో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2015 మార్చిలో55 లక్షల వాహనాలుంటే అక్టోబర్ నాటికి 58 లక్షలకు పెరిగాయి. వీటిలో 12 లక్షలు కార్లు ఉన్నాయి. ప్రతిరోజు 1600 వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. ఒక్కోసారి ఈ సంఖ్య 2 వేలను దాటుతోంది. ఐటీ, దాని అనుబంధ కంపెనీలకు ప్రధాన కేంద్రం కావడంతో ఏటా కొత్తవారు లక్షల సంఖ్యలో నగరంలో స్థిరపడుతున్నారు. సాఫ్ట్వేర్ రంగం వల్ల 15 లక్షల వాహనాలు నగరంలో కొత్తగా చేరాయి. వీటి సంఖ్య ఏటా ఏడు నుంచి 10 శాతం పెరుగుతోంది. ప్రతి చదరపు కిలోమీటర్‌కు రోడ్ల విస్తీర్ణం ఢిల్లీలో 21 కి.మీ., హైదరాబాద్‌లో 9.5 కి.మీ. ఉండగా ఇక్కడ 8.2 కిలోమీటర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యను అధిగమించేందుకు కొన్ని పరిష్కార మార్గాల అమలుకు యత్నిస్తున్నారు. అవి.. ► ఎక్కువ శాతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం, బస్సులు, మెట్రోలు, రైళ్లలో ప్రయాణించేలా ప్రోత్సహించడం. ► ఆఫీసుకు, ఇంటికి మధ్య దూరం తక్కువ ఉంటే సైకిల్ వాడడం. ► కంపెనీలు తమ ఉద్యోగులకు క్యాబ్‌లు సమకూర్చడం. ► అవకాశమున్నచోట వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించడం. ► షిఫ్ట్ విధానం అమలు చేయడం ► ఒకే మార్గంలో వెళ్లేవారు ఎవరికివారు సొంత వాహనాల్లో కాకుండా కార్ పూలింగ్ పాటించడం. 2012 లెక్కల ప్రకారం బెంగళూరులో ఐటీ, బీపీఓ రంగాల్లో సుమారు 8 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 12 లక్షలకు పైగా ఉంది. రోజు రెండు గంటల సమయం జర్నీ కోసం వెచ్చిస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 470 గంటలు రోడ్లపై ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నారు. దీనివల్ల ఆయా సంస్థలకు సుమారు రూ. 33 వేల కోట్లు వృధా అవుతున్నట్టు ఓ సర్వేలో తేల్చారు. ఇక్కడ.. హైదరాబాద్ ► నగర విస్తీర్ణం 650 చ.కి.మీ. ►జనాభా సుమారు ఒక కోటి ►వాహనాల సంఖ్య 44 లక్షలు ►వాహనాల సగటు వేగం గంటకు 13 కి.మీ. ►{పతిరోజు రిజిస్టర్ అవుతున్న వాహనాలు 750 ►నెలకు రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాలు 19,500. వీటిలో కార్లు 4500 ►రోడ్ల విస్తీర్ణం (చ.కి.మీ.) 9.5 కి.మీ. అక్కడ.. బెంగళూరు ► నగరం విస్తీర్ణం 709 చ.కి.మీ. ► జనాభా కోటి 15 లక్షలు ► వాహనాల సంఖ్య 58 లక్షలు (2015 అక్టోబర్) ► వాహనాల సగటు వేగం గంటకు 9.2 కి.మీ. ►{పతిరోజు రిజిస్టర్ అవుతున్న వాహనాలు 1600 ► నెలకు కొత్తగా వస్తున్న వాహనాలు దాదాపు 50 వేలు ► రోడ్ల విస్తీర్ణం (చ.కి.మీ.) 8 కి.మీ.