కేన్సర్లకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు మధ్య అత్యంత బలమైన బంధం
శరీరంలో కేన్సర్లను ప్రేరేపిస్తున్న కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు
2024లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త కేన్సర్ కేసుల్లో 23 లక్షల కేసులకు ఇన్ఫెక్షన్లే కారణం
మన దేశంలో 2024లో నమోదైన కేసుల్లో 1.9 లక్షల కేసులు ఇన్ఫెక్షన్ల వల్లే..
జీవనశైలి మార్పులు, అవగాహన పెంపు, సకాలంలో వ్యాక్సిన్లే మందు
‘ద లాన్సెట్ ఆంకాలజీ’లో అంతర్జాతీయ అధ్యయనం వివరాలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో ఇన్ఫెక్షన్ల పాత్రపై అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం నమోదవుతున్న ప్రతి 8 కేన్సర్ కేసుల్లో ఒకటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్లే వస్తోందని తేలింది. కేన్సర్లకు, వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు మధ్య అత్యంత బలమైన సంబంధం ఉందని, కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు శరీరంలో కేన్సర్‌ను ప్రేరేపించగలవని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 2024లో నమోదైన కొత్త కేన్సర్ కేసుల్లో సుమారు 23 లక్షల కేసులు కేవలం ఇన్ఫెక్షన్ల వల్లే సంభవించాయి. ఇది మొత్తం కేన్సర్ కేసుల్లో 12 శాతం (అంటే ప్రతి 8 కేసులలో ఒకటి). ఇక భారత్ విషయానికొస్తే..మన దేశంలో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఇండియాలో 2024లో నమోదైన కేన్సర్ కేసుల్లో దాదాపు 1.9 లక్షల కేసులు వివిధ రకాల ఇన్ఫెక్షన్లతోనే ముడిపడి ఉన్నాయి. ఇటీవల ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్ ఆంకాలజీ’లో ప్రచురితమైన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఈ సరికొత్త విషయాలను వెల్లడించింది. సాధారణంగా కేన్సర్ అంటే కేవలం వంశపారంపర్యంగానో, పొగాకు, మద్యం లేదా కలుషిత ఆహారం వల్లో వస్తుందని అనుకుంటారు. కానీ కంటికి కనిపించని వైరస్‌లు, బ్యాక్టీరియాలు కూడా కేన్సర్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. జీవనశైలి మార్పులతో పాటు ఇన్ఫెక్షన్లపై అవగాహన పెంచుకోవడం, సకాలంలో వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా లక్షలాది కేన్సర్ మరణాలను నివారించవచ్చునని వెల్లడించింది.
కేన్సర్‌కు కారణమయ్యే 5 ప్రధాన ఇన్ఫెక్షన్లు
ఈ అధ్యయనం ప్రకారం..కేన్సర్‌కు దారితీసే 12 రకాల ఇన్ఫెక్షన్ కారకాలను పరిశోధించగా, అందులో 5 ప్రధాన ఇన్ఫెక్షన్లు దాదాపు అత్యధిక శాతం కేసులకు కారణమవుతున్నాయి.
–హెలికోబాక్టర్ పైలోరీ: ఇది జీర్ణాశయంలో చేరే బ్యాక్టీరియా. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 7.6 లక్షల కేసులకు కారణమైంది (ముఖ్యంగా కడుపు/జీర్ణాశయ కేన్సర్)
– హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హేచ్‌పీవీ): ఇది ప్రధానంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు (సర్వైకల్ కేన్సర్) కారణమవుతోంది. ఇది దాదాపు 7.5 లక్షల కేన్సర్ కేసులకు దారితీసింది
– హెపటైటిస్ బి వైరస్ (హేచ్‌బీవీ),హెపటైటిస్ సి వైరస్ (హేచ్‌సీవీ): ఈ వైరస్‌లు కాలేయాన్ని (లివర్) దెబ్బతీసి, దీర్ఘకాలంలో లివర్ కేన్సర్‌కు కారణమవుతాయి. హేచ్‌బీవీ వల్ల 3.6 లక్షలు, హేచ్‌సీవీ వల్ల 1.6 లక్షల కేసులు నమోదయ్యాయి.
– ఎప్‌స్టెయిన్–బార్ వైరస్ (ఈబీవీ): ఇది కొన్ని రకాల బ్లడ్ కేన్సర్లు (లింఫోమాస్), గొంతు, జీర్ణాశయ కేన్సర్లకు గురి చేస్తుంది. ఇది సుమారు 2.6 లక్షల కేసులకు కారణమైంది.
ఇన్ఫెక్షన్ కేన్సర్‌గా ఎలా మారుతుంది?
⇒ ఒక సాధారణ ఇన్ఫెక్షన్ శరీరంలో కేన్సర్‌గా మారడానికి దారితీస్తున్న ప్రక్రియను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
⇒ దీర్ఘకాలిక వాపు (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్): వైరస్ లేదా బ్యాక్టీరియా శరీరంలో చేరినప్పుడు, రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడుతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్లు ఏళ్ల తరబడి శరీరంలోనే ఉండిపోతే అక్కడ దీర్ఘకాలిక వాపు లేదా గాయం ఏర్పడుతుంది
⇒ కణాల డీఎన్‌ఏ దెబ్బతినడం: ఈ నిరంతర వాపు వల్ల స్థానిక కణాలలోని డీఎన్‌ఏ నిర్మాణం దెబ్బతింటుంది
⇒ నియంత్రణ లేని కణ విభజన: దెబ్బతిన్న డీఎన్‌ఏ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా విభజన చెందడం ప్రారంభిస్తాయి. ఇవే క్రమంగా కేన్సర్ గడ్డలుగా (ట్యూమర్స్) మారతాయి.
ముందే నివారించవచ్చు..
⇒ ఈ అధ్యయనంలో ఒక సానుకూల అంశం ఏమిటంటే ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే కేన్సర్లను ముందే నివారించవచ్చు. ఇన్ఫెక్షన్లను ముందే గుర్తించడానికి కొన్ని సాధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
⇒ వ్యాక్సినేషన్: హేచ్‌పీవీకి వ్యతిరేకంగా ఇచ్చే వ్యాక్సిన్ గర్భాశయ కేన్సర్‌ను, హెపటైటిస్–బి వ్యాక్సిన్ లివర్ కేన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలదు.
⇒ స్క్రీనింగ్ పరీక్షలు: మహిళలు క్రమం తప్పకుండా ‘ప్యాప్ స్మియర్’వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా కేన్సర్ ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చు. 21–30 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 3 నుండి 5 ఏళ్లకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార కేన్సర్ ముప్పును 100% నివారించవచ్చు. దీర్ఘకాలిక గ్యా్రస్టిక్ సమస్యలున్నవారు హెచ్ పైలోరి పరీక్ష ద్వారా కడుపులో బ్యాక్టీరియా ఉందో లేదో తెలుసుకోవచ్చు.
⇒ యాంటీబయాటిక్స్: కడుపులో హేచ్ పైలోరి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ను సరైన యాంటీబయాటిక్స్ ద్వారా ముందే నయం చేయడం వల్ల జీర్ణాశయ కేన్సర్ రాకుండా చూడొచ్చు


