ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు పాల్పడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానమే ఆ కేసును కొట్టేసి, ఈ పొలిటికల్ డ్రామాకు తెరదించినా.. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని ఆయన విమర్శించారు. అసలు ఈ నోటీసుల వెనుక ఉన్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామని, ఈ భారీ స్కామ్ నుండి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీష్ రావు గారికి నోటీసులు పంపారని కేటీఆర్ ఆరోపించారు. ఇది పక్కాగా రేవంత్ రెడ్డి మార్క్ 'డైవర్షన్ పాలిటిక్స్' అని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నిరంతరం ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, పాతపడిపోయిన కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
గత 24 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని తెలిపారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేస్తూనే.. నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూడటం భ్రమ మాత్రమేనని హెచ్చరించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేటాడటం ఆపేది లేదని, కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.


