
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదం కొత్త మలుపు తిరిగింది. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుపై చర్చకు ససేమీరా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఓ లేఖ రాసింది.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపు(జూలై 16, 2025) అత్యున్నత స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఇందులో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, పర్యావరణ అనుమతులు, జల వివాదాలు ప్రధాన అంశాలు చర్చిస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో..
ఇద్దరు సీఎంలను హాజరు కావాలంటూ కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల వివరాలు, అజెండా పంపాలని పేర్కొంది. అయితే..

అయితే బనకచర్లపై చర్చించాలంటూ ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి తాజాగా లేఖ రాసి ట్విస్ట ఇచ్చింది.
ఇప్పటివరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవు. బీఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీలు సైతం అభ్యంతరాలు తెలిపాయి. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించే బనకచర్లపై రేపటి సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదు. ఇతర అంశాలపై చర్చిస్తేనే మీటింగ్‌కు వస్తామని తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా కేంద్రానికి స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల నడుమ బనకచర్ల ప్రాజెక్టు వివాదాస్పందంగా మారింది తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి వరద జలాలను రాయలసీమకు మళ్లించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి చర్చలు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కీలకంగా మారే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే తెలంగాణ ప్రభుత్వ తాజా లేఖతో జరగబోయే పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ అభ్యంతరాలు
ప్రాజెక్టు రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని వాదన
గోదావరి ట్రైబ్యునల్ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉందని అభిప్రాయం
నాగార్జునసాగర్ వాడకాన్ని తప్పుబడుతూ, పర్యావరణ నష్టం గురించి ఆందోళన
ఏపీ వాదనలు
వర్షాకాలంలో సముద్రంలో కలిసిపోతున్న వరద జలాలను వినియోగించాలన్న ఉద్దేశం
రూ.80,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రతిపాదన
3 దశల్లో నిర్మాణం: పోలవరం → బొల్లపల్లి → బనకచర్ల
ఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపించివేసింది. ఈ ప్రాజెక్టుపై పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) అభ్యంతరాలు వ్యక్తం చేసిందని తెలిపింది. ఈ క్రమంలోనే గోదావరి వరద జలాల లభ్యతపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
ఇదీ చదవండి: బనకచర్ల.. గురు శిష్యుల డ్రామానా?