సాక్షి, నిర్మల్ జిల్లా: పాఠశాల ముగిసింది.. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లారు. కానీ రెండో తరగతి చదువుతున్న ఓ చిన్నారి మాత్రం తరగతి గదిలోనే నిద్రపోయాడు. అది గమనించని పాఠశాల సిబ్బంది.. గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాల్సిన బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు తరగతి గదిలో నుంచి వినిపించిన ఏడుపుతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.
తానూర్ మండలం బెంబేర పాఠశాలలో విద్యార్థి భీమ్‌రావు రెండో తరగతి చదవుతున్నాడు. కాగా, భీమ్‌రావ్ తరగతి గదిలోనే నిద్రపోయాడు. అయితే లోపల చిన్నారి ఉన్న విషయాన్ని గమనించకుండా పాఠశాల సిబ్బంది గదికి తాళం వేసి వెళ్లిపోయారు. ఇంతలో స్కూల్ సమయం ముగిసినా.. స్కూల్ నుంచి ఇంటికి రావాల్సిన కుమారుడు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అదే సమయంలో తరగతి గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తాళం పగులగొట్టి బాలుడిని బయటకు తీసుకొచ్చారు.
ఇక, ఈ ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయురాలు, స్కావెంజర్‌ను సస్పెండ్ చేశారు. చిన్నారి సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్


