
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎన్‌సీబీ సంయుక్త సోదాలకు నిర్ణయం
ఈ సప్లై చైన్ అడ్డుకునేలా ప్రత్యేక వ్యూహం
ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఉత్తర భారత్‌కు రైళ్లలో సరఫరా
సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. స్థానిక పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంత నిఘా పెడుతున్నా ఈ ముఠాలు వారి కళ్లు గప్పి గంజాయి రవాణా చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దుతోపాటు ఒడిశా ఏజెన్సీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నుంచి వస్తున్న గంజాయి రోడ్డు మార్గంలో తెలంగాణ మీదుగా గోవా, బెంగళూరు, ముంబయితోపాటు ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలకు లారీలు, ట్రావెల్స్, క్యాబ్‌లలో తరలిస్తున్నారు.
అయితే రోడ్డు మార్గాన గంజాయి తరలిస్తుంటే స్థానిక పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు నిఘా పెంచడంతో రైలు మార్గాన్ని ఈ ముఠాలు ఎంచుకుంటున్నాయి. విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై ఫోకస్ పెంచారు. రైళ్లలో గంజాయి రవాణా చేస్తున్న సప్లై ఛైన్‌కు అడ్డుకట్ట వేసేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
ఇటీవల ఆర్‌పీఎఫ్ డీజీ సోనాలి మిశ్రాతో ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఎన్‌సీబీ సంయుక్త దాడులు నిర్వహించాలని నిర్ణయించింది. 2047 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియానే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
మత్తు పదార్థాలు గుర్తించేందుకు జాగిలాల వినియోగం
రైళ్లలో రవాణా అవుతున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు అవసరం మేరకు జాగిలాలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ముఠాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ గంజాయి వాసన బయటకు పొక్కకుండా జాగ్రత్తగా సీల్ చేసిన ప్యాకెట్లను తమ వద్ద పనిచేసే డీలర్లకు ఇచ్చి ఏసీ కోచ్‌లలో రవాణా చేయిస్తున్నట్టుగా కూడా అధికారులు ఇటీవల కొన్ని కేసుల్లో గుర్తించారు. కొన్నిసార్లు ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలకు కొంత కమీషన్ ఇచ్చి వారి లగేజీ బ్యాగులలో దుస్తుల మధ్య ప్యాకెట్లు దాచి రాష్ట్రా లు దాటిస్తున్నారు.
ఈ తరహాలో జరుగుతున్న గంజాయి కట్టడికి ఆకస్మిక తనిఖీలు, ఇన్‌ఫార్మర్ల ద్వారా సమాచారంతో దాడులు నిర్వహించే వ్యూహాలు అధికారులు సిద్ధం చేసుకుంటున్నారు. గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రైల్వే స్టేషన్లు, రైళ్లలోని ఎలక్ట్రానిక్ బోర్డులలో సూచనలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా గంజాయి రవాణా అవుతున్న మార్గాలు, రైల్వే స్టేషన్లకు సంబంధించిన సమాచార వినిమయం కోసం ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.