
మూసీ సుందరీకరణ నమూనా చిత్రం
నది సమగ్రాభివృద్ధి పనులకు త్వరలో శ్రీకారం
తొలి దశలో 20.5 కి.మీ. సుందరీకరణకు రూ.5,641 కోట్ల వ్యయం
ఫేజ్–1ఏలో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.5 కి.మీ. అభివృద్ధి
ఫేజ్–1బీలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు11 కి.మీ. సుందరీకరణ
ఘన, జల వ్యర్థాల నుంచి విముక్తి.. 2 మీటర్ల లోతు వరకు పూడికతీత
24/7 గోదావరి జలాలు.. గండిపేట నుంచి బాపూఘాట్ వరకు బోటింగ్
నదికి ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్ అభివృద్ధి
సరిహద్దు వెంబడి 20 మీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్
వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్‌లు, యాంఫీ థియేటర్లు, షాపింగ్ మాల్స్
లైట్ అండ్ సౌండ్ షోలు, వాటర్‌స్పోర్ట్స్, మేళాలు, సాంస్కృతిక వేదికలు
300 శాశ్వత పోస్టులు, 3,200 తాత్కాలిక ఉద్యోగాలు
రూ.4,100 కోట్ల రుణం మంజూరుకు ఏడీబీ సుముఖత
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. త్వరలోనే మూసీ సమగ్రాభివృద్ధి పనులకు సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఆర్‌డీసీఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మూసీ 55 కి.మీ. మేర ప్రవహిస్తుండగా..తొలి దశలో 20.5 కి.మీ. మేర నదిని పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన సంగతి తెలిసిందే. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, గండిపేటల నుంచి బాపూఘాట్ వరకు రూ.5,641 కోట్ల వ్యయంతో మూసీ నది సుందరీకరణ చేపట్టనున్నారు.
మాస్టర్ ప్లాన్ రెడీ!
తొలి దశ మూసీ అభివృద్ధి పనుల కోసం రుణం మంజూరు చేసేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సుముఖత వ్యక్తం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదీతీర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఇందుకోసం ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిసింది. తొలి దశలో 20.5 కి.మీ. అభివృద్ధి చేసేందుకు రూ.5,641 కోట్ల వ్యయాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫేజ్–1ను రెండు సబ్ ఫేజ్‌లుగా విభజించిన అధికారులు ఫేజ్–1ఏలో హిమాయత్‌సాగర్ టు బాపూఘాట్ వరకు 9.5 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్‌సాగర్ టు బాపూఘాట్ వరకు 11 కి.మీ. అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏ కింద రూ.2,500 కోట్లు, ఫేజ్–1బీ కింద రూ.3,141 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. అంచనా వ్యయంలో రూ.4,100 కోట్లు ఏడీబీ నుంచి రుణం రూపంలో పొందనుండగా.. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనుంది.
493 ఎకరాలు అవసరం
మూసీ తొలి దశ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి 493 ఎకరాల (199.89 హెక్టార్లు) భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇందులో 340 ఎకరాలు (137.72 హెక్టార్లు) పట్టా భూములు కాగా.. మిగిలిన 153 ఎకరాలు (62.17 హెక్టార్లు) ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. భూ సేకరణ, పునరావాసం, నాణ్యమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం (ఆర్‌ఎఫ్‌సీటీఎల్‌ఏఆర్‌ఆర్)–2013 కింద భూ సేకరణ చేపట్టనున్నారు. సేకరించే భూమిలో మూసీ చుట్టూ గ్రీన్ బెల్ట్ కోసమే సుమారు 270 ఎకరాలు (109.42 హెక్టార్లు) కేటాయించనున్నారు.
ఇరువైపులా రిటైనింగ్ వాల్‌లు
మూసీకి పునరుజ్జీవం కల్పించాలంటే తొలుత ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నదిలో 2 మీటర్ల లోతు వరకు వ్యర్థాలు, పూడిక తీయనున్నారు. నదికి ఇరువైపలా రిటైనింగ్ వాల్‌లను నిర్మిస్తారు. ఆ తర్వాత నదిలోకి గోదావరి జలాలను వదులుతారు. ఈ నీళ్లు 24/7 ఉండేలా చూస్తూ గండిపేట నుంచి బాపూఘాట్ వరకు బోటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. నది సరిహద్దుల నుంచి 20 మీటర్ల వెడల్పు వరకు గ్రీన్ బెల్ట్ ఉంటుంది. ఇందులో గ్రీనరీ పెంపకంతో పాటు వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్‌లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్‌లు, వర్షపు తోటలు, గ్రీన్‌రూఫ్‌లు, బ్యాటరీతో నడిచే వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి.
వరదల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ
నదికి ఇరువైపులా 50 మీటర్లు బఫర్ జోన్‌గా అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా అభివృద్ధి చేస్తారు. మరోవైపు మూసీ వరదలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. బఫర్ జోన్‌లో వరద నియంత్రణ కాల్వలు, నాలాలు, పంపింగ్ స్టేషన్లు, వరద నియంత్రణ గోడలు, వరద పర్యవేక్షణ భవనాలు, వరద నిరోధక డెక్‌ల వంటి పటిష్టమైన మౌలిక సదుపాయాలుంటాయి.
త్వరలో ‘మూసీ ఉద్యోగాల’ భర్తీ
మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్మాణ దశలో 100 శాశ్వత పోస్టులను ఏర్పాటు చేసి భర్తీ చేయడంతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన 3 వేల మంది ఉద్యోగులను నియమించనున్నారు. కార్యాచరణ దశలో 200 శాశ్వత పోస్టులతో పాటు తాత్కాలిక ప్రాతిపదికన మరో 200 పోస్టులు ఏర్పాటు చేసి నియామకాలు జరుపుతారు.
మూసీని నైట్ (రాత్రి) ఎకానమీగా, అదనపు ఆదాయాన్ని సమకూర్చే వనరుగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు మూసీ చుట్టూ యాంఫీ థియేటర్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, వీధి విక్రేతల దుకాణాలు, కియోస్‌్కలు వంటి వ్యాపార, వాణిజ్య నిర్మాణాలను చేపడతారు. లైట్ అండ్ సౌండ్ షోలు, వాటర్ స్పోర్ట్స్, మేళాలు, సాంస్కృతిక వేదికలు కూడా ఉంటాయి.