అమృత్ భారత్ అమలుతో ఆధునిక హంగులు
వడివడిగా 14 స్టేషన్ల పనులు
హైటెక్ సిటీ, హఫీజ్‌పేటలో సిద్ధం
హఫీజ్‌పేట్ స్టేషన్, హైటెక్ సిటీ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లకు మహర్దశ వచ్చింది. ఇప్పుడు ఆధునిక హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందజేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, బుకింగ్ కేంద్రాలు, హైదరాబాద్ సంస్కృతిని ప్రతింబించేవిధంగా రూపొందించిన స్టేషన్ సమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’లో భాగంగా దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌లో 14 స్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. బేగంపేట్ స్టేషన్ పూర్తిస్థాయి సదుపాయాలతో గతేడాది అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఈ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.2076 కోట్లతో..
మొత్తం 14 స్టేషన్‌లకు రూ.2076.42 కోట్లతో పునరాభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ప్రధాన స్టేషన్లు మినహాయిస్తే మిగతావన్నీ ఎంఎంటీఎస్ స్టేషన్లు. సుమారు రూ.714.73 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు ఊపందుకున్నాయి.
రూ.29.21 కోట్లతో చేపట్టిన హఫీజ్‌పేట్, రూ.35.61 కోట్లతో చేపట్టిన హైటెక్‌సిటీ స్టేషన్లలో పనులు తుదిదశకు చేరుకొన్నాయి. వీటిని అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కళాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, సీట్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ప్రయాణికులు మెచ్చేలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు.


