బంజారాహిల్స్ (హైదరాబాద్): తన సోదరి కనిపించడం లేదంటూ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అదృశ్యమైన మహిళ కోసం గాలింపు చేపట్టారు. వివరాలివి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని కమాన్‌లో నివసించే మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోదరి కె.నమ్రత (57) ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది.
సాయంత్రమైనా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్ని ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో మాజీ మేయర్ తన సోదరి కనిపించడం లేదంటూ ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు. సతీశ్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) తదితరులపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో విజయలక్ష్మి అనుమానం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


