54.55 కి.మీ. మిస్సింగ్ లింక్ రోడ్లకు ప్రతిపాదనలు
1,976 ఆస్తులపై ప్రభావం.. భూసేకరణే సవాల్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 54.55 కిలోమీటర్ల మేర మిస్సింగ్ లింక్ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతిపాదిత రోడ్లలో ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీలో విలీనమైన, శివారు అభివృద్ధి బెల్ట్‌గా మారిన ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. బడంగ్‌పేట్, నాదర్‌గుల్, కుర్మల్‌గూడ, తుర్కయాంజాల్, మల్లాపూర్, జల్‌పల్లి పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్ పరిసరాల్లో గొల్లపల్లి, రాళ్లగూడ, ధర్మగిరి ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. బడంగ్‌పేట్ మెయిన్ రోడ్ నుంచి తుర్కయాంజాల్ వరకు, మల్లాపూర్ క్రాస్ రోడ్ నుంచి కుర్మల్‌గూడ వరకు, కుర్మల్‌గూడ నుంచి నాదర్‌గుల్ వరకు, ఆర్‌సీఐ క్రాస్ రోడ్ నుంచి శ్రీశైలం హైవే వరకు ప్రతిపాదించిన రహదారులు దక్షిణ హైదరాబాద్‌లో కీలక అనుసంధాన మార్గాలుగా మారనున్నాయి.
ఎయిర్‌పోర్ట్ కారిడార్‌కు ఊతం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గణనీయంగా రోడ్ల విస్తరణ ప్రతిపాదించారు. గొల్లపల్లి ఎన్‌హెచ్ జంక్షన్ నుంచి ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ వరకు, శంషాబాద్ రైల్వే క్రాసింగ్ నుంచి ధర్మగిరి రోడ్ వరకు, శంషాబాద్ బస్టాప్ నుంచి రాళ్లగూడలోని ఓయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు పనులు వీటిలో ఉన్నాయి.
నార్సింగి– కిస్మత్‌పూర్ కారిడార్‌పై ఫోకస్
పశ్చిమ హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న నార్సింగి, కిస్మత్‌పూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలకూ ఈ లింక్ రోడ్ల ద్వారా ఊరట లభించే అవకాశం ఉంది. బైరాగిగూడ నుంచి నార్సింగి వరకు, ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్ నుంచి చేవెళ్ల రోడ్ వరకు కిస్మత్‌పూర్ మీదుగా, వివేకానంద విగ్రహం నుంచి ప్రతిష్ఠ విల్లాస్ వరకు రహదారి విస్తరణ ప్రతిపాదించారు. దర్గా నుంచి ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వరకు, ఫర్మాయిష్ హోటల్ నుంచి తారామతి బారాదరి వరకు (వయా కేంద్రీయ విహార్ అపార్టమెంట్స్) రోడ్డు కూడా వీటిలో ఉంది.
కోర్ సిటీలో..
ఖైరతాబాద్ జోన్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి పాటిగడ్డ వరకు, బేగంపేట్ రైల్వే స్టేషన్ దగ్గరి రోడ్డు కూడా వీటిలో ఉంది. ఈ రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం 1,976 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ తెలిపారు. భూసేకరణ సవాల్‌గా మారనుందన్నారు.
చదవండి: హెచ్‌ఎండీఏ భూ వేలంపై నీలినీడలు


