KTR: ప్రపంచాన్ని ఆదుకునే స్థాయిలో ఫార్మాసిటీ: కేటీఆర్

Minister KTR On Pharma In Telengana - Sakshi

భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ప్రపంచాన్ని ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఉండబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ధీమా వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సు ఈ నెల 24వ తేదీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కేటీఆర్‌ మీడియాతో ముచ్చటించారు. 

త్వరలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం
‘జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారింది. ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోంది. త్వరలోనే ఈ సంఖ్య 1,400 కోట్లకు చేరుతుంది. టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుంది. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా (214) ఉండటం, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్కు, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్‌ను జీవశాస్త్ర రంగంలో అగ్రగామిగా నిలుపుతున్నాయి. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ‘సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌’తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి..’అని మంత్రి తెలిపారు. 

ఈ ఏడాది రాబర్ట్‌ లాంగర్‌కు అవార్డు
‘బయో ఆసియా గత 19 ఏళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్‌ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగాం. 20 వేలకు పైగా భాగస్వామ్య చర్చలకు వెసులుబాటు కల్పించాం. ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ తయారీకి కీలకమైన ప్రయోగాలు నిర్వహించిన రాబర్ట్‌ లాంగర్‌కు ఈ ఏడాది జినోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును అందించనున్నాం. 400కు పైగా స్టార్టప్‌లతో నిర్వహిస్తున్న పోటీలో 75 వరకూ స్టార్టప్‌లను స్క్రీన్‌ చేయగా.. వీటిల్లో టాప్‌ 5 సంస్థలు బయో ఆసియా సదస్సు తుది రోజు తమ ఆలోచనలను పంచుకోనున్నాయి..’అని వెల్లడించారు.

తొలిసారిగా సదస్సుకు ఆపిల్‌ కంపెనీ..
‘బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతిఆయోగ్‌ ఇతర రాష్ట్రాలకు బయో ఆసియా నిర్వహణ, ఫలితాలపై మాస్టర్‌ క్లాస్‌ ఇస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై బయో ఆసియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. (ఈ సందర్భంగా కేటీఆర్‌ కొన్ని ఉదాహరణలు చెప్పారు) 20వ బయో ఆసియా సదస్సులో తొలిసారి ఆపిల్‌ కంపెనీ కూడా పాల్గొంటోంది. ఆపిల్‌ ఆరోగ్య విభాగానికి చెందిన డాక్టర్‌ సంబుల్‌ దేశాయి, యునిసెఫ్‌ ప్రతినిధి సింథియా మెకాఫీ, దేశీ ఫార్మారంగ ప్రముఖులు అజయ్‌ పిరమల్, సతీశ్‌రెడ్డి, గ్లెన్‌ సల్దానా తదితరులు పాల్గొంటున్నారు..’అని కేటీఆర్‌ వివరించారు.

రెట్టింపు పెట్టుబడులు, ఉద్యోగాలు
‘జీవశాస్త్ర రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బయో ఆసియాతో పాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2021లో హైదరాబాద్, దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఆదాయం 50 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2028 నాటికి దీన్ని వంద బిలియన్‌ డాలర్లకు చేరుస్తాం. ప్రస్తుతం ఈ రంగంలోని 4 లక్షల ఉద్యోగాలను 8 లక్షలు చేస్తాం. రంగారెడ్డి జిల్లా మెడికల్‌ కాలేజీని ఫార్మాసిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం..’అని చెప్పారు.

‘టీం ఇండియా’స్ఫూర్తి నినాదాలకే పరిమితం
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు మొదలుకొని రక్షణ రంగం ప్రాజెక్టు వరకు పలు విషయాల్లో కేంద్రం తనదైన శైలిలో వ్యవహరించిందని, ‘టీం ఇండియా’అన్న స్ఫూర్తిని కేవలం నినాదాలకే పరిమితం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, తెలంగాణ జీవశాస్త్ర, ఫార్మా విభాగపు డైరెక్టర్‌ శక్తి నాగప్పన్‌లు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top