డబుల్ ఆత్మగౌరవం : కేటీఆర్‌

Minister KTR Launches Double Bedroom House - Sakshi

ఇళ్లు లేని పేదల కోసమే సీఎం ఈ పథకం పెట్టారు: కేటీఆర్‌

వనస్థలిపురంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో జరుగుతున్న స్లమ్‌ ఫ్రీ అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి కే.టీ.రామారావు అన్నారు. వనస్థలిపురం రైతుబజార్‌ సమీపంలో రెండెకరాల విస్తీర్ణంలో రూ. 28.03 కోట్ల వ్యయంతో నిర్మించిన 324 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గ్రేటర్‌ పరిధిలో రూ. 9,714 కోట్ల వ్యయంతో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందులో దాదాపు 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుందని చెప్పారు. ఇప్పటికే 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాల వంటివి మరే రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు.

నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారని మంత్రి వివరించారు. వనస్థలిపురంలో సెల్లార్, స్టిల్ట్, 9 అంతస్తులలో మూడు బ్లాకుల్లో నిర్మించిన 324 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విలువ మార్కెట్‌లో దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఇక్కడ భూమి విలువ గజానికి రూ.లక్షకు పైగానే ఉంటుందని చెప్పారు. సీఎం కార్యాలయానికి ఏ లిఫ్ట్‌లు అయితే వాడుతున్నారో, ఇక్కడ కూడా ఆ కంపెనీకి చెందిన లిఫ్ట్‌లు వాడుతున్నామన్నారు. ఈ సందర్భంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారులకు యాజమాన్య పట్టాలను, ఇంటి తాళం చెవులను కేటీఆర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్‌  తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top