
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తనకు సిట్ విచారణపై నమ్మకం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది తానే అని సంజయ్ చెప్పుకొచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేంద్రమంత్రి బండి సంబయ్ బయలుదేరారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నన్ను విచారణకు పిలిచారు.. వెళ్తున్నాను. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు అందజేస్తాను. బాధ్యత గల పౌరుడిగా నేను వెళుతున్నాను. సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు. ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం నా ఫోన్ ట్యాప్ చేశారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారు. మిగిలిన విషయాలు సిట్ విచారణ అనంతరం మాట్లాడతాను’ అని తెలిపారు.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక, బీజేపీ ఈ వ్యవహారాన్ని.. జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. కేంద్ర నిఘా వర్గాల నుండి కీలక సమాచారాన్ని కూడా బండి సంజయ్ సేకరించినట్టు తెలుస్తోంది. నిఘా వర్గాలు సైతం సంజయ్ ఫోన్‌ను అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించారని సమాచారం. ఇక, ఈరోజు బండి సంజయ్‌తో పాటుగా.. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ విచారణకు హాజరు కానున్నారు.
