మజ్లిస్ పార్టీ అండదండలతో హిందూ అమ్మాయిలపై దురాగతాలు
వారిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం
ప్రభుత్వం సరైన విధంగా స్పందించకుంటే కేంద్ర బలగాలు దింపుతాం
మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మజ్లిస్ పార్టీ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకొని కిడ్నాప్, అత్యాచారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పాతబస్తీ పోలీసులు కనీస విచారణ జరపడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లతో చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.
పాతబస్తీలో హిందూ అమ్మాయిలు అత్యధికంగా చదువుకునే స్కూళ్లను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠా అరాచకాలు చేస్తోందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూడాలని, హిందూ బాలికల జీవితాలను కాపాడాలని, లేకపోతే పాతబస్తీలో వేలాది మంది హిందూ యువకులతో రక్షక దళాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. అవసరమైతే చట్టానికి లోబడి కేంద్ర బలగాలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు.
తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేసి డ్రగ్స్ ముఠా అంతు చూస్తానని, అందుకు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పాతబస్తీలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కేరళ ఫైల్స్ సినిమాను తలపిస్తోందన్నారు. మొదట ఈ రాకెట్ ఓ స్కూల్‌లో ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకొని బర్త్‌డే పేరుతో ముస్లిం అమ్మాయి ఇంటికి పిలిపించి తక్కువ డోస్ ఉన్న డ్రగ్స్ చాక్లెట్ తినిపించారని, ఆ తర్వాత ఆ చాక్లెట్లలో డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి ఆరు రోజుల తర్వాత కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారన్నారు.
అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేయరని, ఫిర్యాదు చేసిన ఒకటి రెండ్రోజులకే ఆ అమ్మాయిలను ఇంటి వద్ద వదిలి వెళతారని, విచారణ జరపాలని అడిగితే మీ అమ్మాయి ఎట్లాగూ వచ్చింది కదా, ఇక విచారణ ఎందుకని కేసును క్లోజ్ చేస్తారని చెప్పారు. ఇలాంటి కేసులు అక్కడ చాలా ఉన్నాయన్నారు.
పాతబస్తీ మజ్లిస్ అడ్డా కాబట్టి... ఒవైసీ చెప్పినట్టు నడుస్తోందని, మజ్లిస్ అండతో పోలీసులు డ్యూటీ నిర్వహించకుండా డబ్బులు దండుకుంటున్నారన్నారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకునే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, గోషామహల్ అధ్యక్షుడు ఉమా మహేందర్, బీజేపీ నేతలు ఎన్వీ సుభాశ్, జి.మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా?
జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి: బండి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘మళ్లీ చెబుతున్నా హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు.. బీజేపీ 80 శాతం మంది హిందువుల పక్షాన పోరాడుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి’అని సంజయ్ ఆరోపించారు.
హిందువుల ఓట్లే అవసరం లేదన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ జూన్ 8న మృతి చెందారు. కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గోపీనాథ్ తల్లి అదే నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు, ఫిర్యాదు కాపీ నాదగ్గరున్నాయి’అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఆయన కుమారుడిని విదేశాల నుంచి ఇండియాకు రానీయకుండా మాజీ మంత్రి బెదిరించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో సీఎం రేవంత్‌కు వాటా ఉంది’అని ఆరోపించారు. దీపక్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చేబాధ్యతను తాను తీసుకుంటానన్నారు.


