
సుప్రీంకోర్టు తీర్పు రాకపోవటం, సాంకేతిక సమస్యలే కారణం
ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లోనూ గందరగోళం
కౌన్సెలింగ్‌కు మరో వారం రోజులు పట్టే అవకాశం
రెండు రకాల ర్యాంకర్ల జాబితాలు సిద్ధం చేస్తున్న కాళోజీ వర్సిటీ
జీఓ 33 ప్రకారం ఒకటి, ఇంటర్ ఇతర ప్రాంతాల్లో చదివిన వారితో మరొకటి!
పీడబ్ల్యూడీ, ఎన్‌సీసీ కోటాలో బోనస్ మార్కులపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై చివరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, పలు సాంకేతిక కారణాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఇంకా రిజిస్ట్రేషన్ల దగ్గరే ఆగిపోయింది.
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్ షెడ్యూళ్లను పలుమార్లు మార్చడం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం వేచి చూస్తుండడంతో రాష్ట్ర కోటా అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కౌన్సెలింగ్‌కు సన్నద్ధం
‘స్థానికత’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కాళోజీ వర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని భావించినప్పటికీ.. తీర్పు రాకపోవడంతో షెడ్యూల్‌ను ప్రకటించలేదు.
కాగా, కాళోజీ వర్సిటీ 33 జీవోకు అనుగుణంగా 9, 10వ తరగతులతోపాటు ఇంటర్మీడియెట్ తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తూ ఒక ర్యాంకర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియెట్ ఇతర ప్రాంతాల్లో చదివిన విద్యార్థులను కూడా కలుపుకొని మరో ర్యాంకర్ల జాబితా రూపొందించాలని భావిస్తోంది.
ఎంసీసీ కౌన్సెలింగ్ సైతం ఆలస్యమే!
ఎంసీసీ ఆధ్వర్యంలో జరగాల్సిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తాయని తెలిసింది. వెబ్‌సైట్ స్తంభించడం, ఆప్షన్లను సబ్‌మిట్ చేసే సమయంలో లోపాలు రావడంతో ఇప్పటివరకు నాలుగుసార్లు షెడ్యూల్‌ను పొడిగించారు. జూలై 21 నుంచి 30 వరకు తొలి విడత కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, పలు వాయిదాల తరువాత ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించారు.
కాగా, పీడబ్ల్యూడీ, ఎన్‌సీసీ కోటా విద్యార్థులకు బోనస్ మార్కులు కలిపే అంశంపై వర్సిటీ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి 79 మంది పీడబ్ల్యూడీ కోటాలో ఉండగా, వీరికి నిమ్స్, సరోజినీ దేవి ఆస్పత్రుల్లో సోమ, మంగళవారాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్‌సీసీ కేటగిరీలో 467 మంది ఉండగా, వీరికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బోనస్ మార్కులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాంకర్ల జాబితా తుది రూపు దాల్చిన తర్వాతే వెబ్ ఆప్షన్లు, సీటు కేటాయింపు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు వర్సిటీ తెలిపింది.