సాక్షి, హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. కిలోమీటర్ల మేరన ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఇవాళ, రేపు వన దేవతలను భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
వీఐపీల తాకిడి..
మేడారం మహాజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తులాభారం వేసి తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) పంచిపెడుతున్నారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మేడారం జాతరలో గత రాత్రి ప్రధాన ఘట్టం పూర్తైన సంగతి తెలిసిందే. చిలకలగుట్ట నుంచి సమక్క తల్లి గద్దెపై కొలువుదీరింది. మహాజాతరలో కీలక ఘట్టాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆగమనానికి ముందు సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం గద్దెకు తీసుకొస్తున్న సమయంలో దారి పొడవునా.. ఇరువైపులా జన ప్రవాహమే కనిపించింది.
సమ్మక్క తల్లి నామస్మరణతో..
చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే జాతర ప్రధాన ఘట్టం గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై.. రాత్రి 9:58గంటలకు గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్ఠించే వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. అడవి తల్లి రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలకలగుట్ట వైపు చూశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన పూజారులు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా, అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే–47 తుపాకీతో 4 విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.


