Medaram Jatara 2022: మంత్రుల ఆదేశాలు బేఖాతర్‌.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే

Medaram Jatara 2022 Devotees Slaughter Chickens Goats Everywhere - Sakshi

విచ్చలవిడిగా కోళ్లు, మేకల వధ

పేరుకుపోతున్న వ్యర్థాలు

పట్టించుకోని అధికారులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి (ములుగు జిల్లా): మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నెల రోజుల ముందు నుంచే అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై కుస్తీ పడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వ్యర్థాల ద్వారా ఈగలు, దోమలు సైతం వ్యాపి చెందుతున్నాయి. 

మంత్రులు చెప్పినా..
జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధానమని, కోవిడ్‌ నేపద్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇటీవల మేడారంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా వారి ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా తల్లులను దర్శించుకునేందుకు గత నెల రోజుల నుంచి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. వారంతా చిలకలగుట్ట, శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్‌ వై జంక్షన్‌ ప్రాంతాల్లో విడిది చేస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు తెచ్చిన మేకలు, కోళ్లను ఎక్కపడితే అక్కడ వధిస్తున్నారు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడ వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


నిరుపయోగంగా మరుగుదొడ్లు

మరుగుదొడ్లు నిరుపయోగం.. 
మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యర్థం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో తాత్కాలిక జీఐ షీట్స్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం కుండీలను కట్టారు. అంతాబాగానే ఉన్న కుండీల్లో మాత్రం నీరు పోయడం లేదు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు మల, మూత్ర విసర్జన సందర్భంగా ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాటర్‌ బాటిళ్లలో నీరు తీసుకుని మరుగుదొడ్లను వినియోగించుకోవడంతో కంపు కొడుతున్నాయి. కాగా, జాతర నాలుగు రోజులు మాత్రమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనే అధికారుల ఆలోచనను భక్తులు తప్పుపడుతున్నారు. ముందస్తుగా జాతరకు వచ్చే వారికోసం సైతం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top