మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు | Massive Arrangements for Medaram Jatara | Sakshi
Sakshi News home page

మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

Jan 13 2026 4:59 PM | Updated on Jan 13 2026 5:38 PM

Massive Arrangements for Medaram Jatara

హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయలు అన్నారు. 

మేడారం జాతరపై నేడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ, ... శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు  అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు,  ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో  జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని  వివరించారు. సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు  పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.   

ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.  

ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.   

రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.  రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ లను మరింత పెంచాలని కోరారు. 

జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు   

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి  సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. 

అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్  రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. 

ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement