
నంబాలకు తూటా తాకగానే నినదించిన మావోయిస్టులు
ఆయనను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాటం
దాదా నేలకొరిగే వరకు వెనుకడుగు వేయని వైనం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో కన్నుమూసి వారం దాటింది. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారమే నంబాల మృతికి కారణమంటూ.. ఆ పార్టీకి చెందిన విప్లవ్ సోమవారం లేఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారులు ఎన్‌కౌంటర్ జరిగిన తీరును వెల్లడించారు. ఆ వివరాలు ‘సాక్షి’కి ప్రత్యేకం.
మూడో రోజు ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అడవుల్లో పీఎల్‌జీఏ కంపెనీ–7 సంచరిస్తోందన్న సమాచారం రావడంతో అక్కడ మావో యిస్టు కీలక నేత ఉన్నట్టుగా భావించిన పోలీసులు ఈనెల 19న సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందిన డీఆర్‌జీ యూనిట్లతో కుడ్‌మేల్–కలజా–జట్లూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆరోజు ఇరువర్గాల మధ్య నాలుగుసార్లు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నా భద్రతా దళాలకు సానుకూల ఫలితం రాలేదు. అయినప్పటికీ అలసిపోకుండా 20వ తేదీ కూడా ముందుకు సాగారు.
ఆ రోజు రాత్రి అడవిలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక 21వ తేదీ తిరిగి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే డీఆర్‌జీ బృందాలను ముందుండి నడిపిస్తున్న జవాన్‌పై సెంట్రీ విధుల్లో ఉన్న ఓ మావోయిస్టు ఉదయం 7 గంటల సమయాన తుపాకీ మడమతో కొట్టి దాడి చేశాడు. ఇరువురి మధ్య జరిగిన పెనుగులాటలో తుపాకులు ఫైర్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఇటు భద్రతా దళాలు, అటు మావోయిస్టులు అప్రమత్తమై పొజిషన్ తీసుకున్నారు.
అప్పటికే మూడు రోజులుగా భద్రతా దళాల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్న సాయుధులైన మావోయిస్టుల బృందం ఎదురుగా ఉన్న భద్రతా దళాల వలయాన్ని ఛేదించుకుని దక్షిణ దిశగా వెళ్లేందుకు యత్నించింది. అయితే అదే దిశగా మరో డీఆర్‌జీ టీమ్ కాల్పులు జరుపుతుండటంతో వెనక్కి తిరిగి ఉత్తర దిశగా వెళ్తూ కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరారు. అక్కడి నుంచి భద్రతా దళాల మీద కాల్పులు జరపడం మొదలెట్టారు.
ఇదే సమయాన మావోయిస్టులంతా వలయాకారంలోకి వచ్చి మధ్యలో ఓ వృద్ధుడైన వ్యక్తిని కాపాడటానికి యత్నించడం భద్రతా దళాలు గమనించాయి. దీంతో వలయంలో ఉన్న పెద్ద మనిషి కచ్చితంగా పార్టీకి చెందిన టాప్‌ర్యాంక్ లీడరై ఉంటాడనే నమ్మకం, పట్టుదలతో కాల్పులు జరుపుతూ మావోయిస్టుల వలయం వైపు దూసుకెళ్లారు.
శక్తివంచన లేకుండా ప్రయత్నించి..
అటువైపు 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉండగా.. డీఆర్‌జీ బలగాలు దాదాపు 1000 మంది నాలుగు బృందా లుగా విడిపోయి కాల్పులు ప్రారంభించారు. ఇరువైపులా అర గంట పాటు కాల్పులు జరిగాయి. మధ్యలో ఉన్న ముఖ్యమైన వ్యక్తికి గార్డుగా నిలిచిన మావోయిస్టుకు తూటా తాకడంతో పడిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే కీలకమైన వ్యక్తికి సైతం తూటా తాకడంతో ఆయన కూడా పడిపోయారు.
అప్పటివరకు వలయంగా ఉండి తమ నాయకుడిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించిన మావోలు ‘లాల్ సలామ్ కామ్రేడ్.. పీఎల్‌జీఏ జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ వలయం నుంచి విడిపోయి చెల్లాచెదురై భద్రతా దళాల వైపు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. కానీ వారిని వెంటాడుతూ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో చాలా మంది చనిపోగా కొందరు తప్పించుకున్నారు.
కాల్పులు ఆగిపోయాక ఘటనాస్థలిలో పరిశీలించగా మావోయిస్టులు తమ ప్రాణాలకు తెగించి కాపాడేందుకు యత్నించిన కీలక వ్యక్తి అక్కడే పడిపోయి ఉన్నాడు. డీఆర్‌జీ జవాన్లలో కొందరు ఆయనను మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ డీఆర్ దాదా అలియాస్ బసవరాజుగా గుర్తించారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా కేశవరావుతో కలిసి మొత్తం 27 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి.
నంబాలకు తూటా ఎక్కడ తాకింది?
ఎన్‌కౌంటర్ మృతుల ఫొటోలను పరిశీలిస్తే ఎక్కువ మంది మావోయిస్టుల తలలకు తూటాల గాయాలు కనిపించాయి. ఎదురు కాల్పులు జరిగే సందర్భాల్లో గాయపడి పారిపోతూ కిందపడిన / చనిపోయిన ప్రత్యర్థుల శరీరాలను స్వాధీనం చేసుకునే క్రమాన ముందు జాగ్రత్తగా తలపై కాలుస్తుంటారు. అందుకే నంబాల రక్షణ టీమ్‌లో చాలామందికి హెడ్‌షాట్స్ కనిపించాయి.
అయితే నంబాలకు మాత్రం అలా కనిపించలేదు. శరీరంలో మరేదైనా కీలక భాగంలో తూటా గాయం కావడంతోనే ఆయన మరణించి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రాణాలతో పట్టుబడిన నంబాలను భద్రతా దళాలు కాల్చి చంపాయని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించారు.
నంబాలకు కుటుంబసభ్యులకన్నీటి నివాళి
మృతదేహం అప్పగించకపోవడంతో కలత చెందిన తల్లి, సోదరుడు
ఏపీ హైకోర్టులో చత్తీస్‌గఢ్ పోలీసులపై కోర్టు ధిక్కార కేసు నమోదు
టెక్కలి: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు మంగళవారం నివాళులు అరి్పంచారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో కేశవరావు నివాసం వద్ద తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లేశ్వరరావుతోపాటు కుటుంబ సభ్యులంతా నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు మరో మారు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా చత్తీస్‌గఢ్ పోలీసులు దాన్ని ధిక్కరించడంపై కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లేశ్వరరావు తరఫున పౌర హక్కుల సంఘం మరోమారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర డీజీపీ అరుణదేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తదితర అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తోంది.