
నంబాల కేశవరావు మృతదేహం (ఇన్‌సెట్‌లో ఫైల్ ఫొటో)
ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్
పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అడవుల్లో నెత్తుటి ధారలు
ఎదురుకాల్పుల్లో డీఆర్‌జీ జవాన్ ఒకరు మృతి..మరి కొంతమందికి గాయాలు
పక్కా సమాచారంతో భద్రతా దళాల ఆపరేషన్
బుధవారం తెల్లవారుజామున గర్జించిన తుపాకులు
కేశవరావు మరణించినట్టు ప్రకటించిన అమిత్ షా
ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న నేత మరణించడం ఇదే మొదటిసారని వెల్లడి
అసాధారణ విజయం అన్న ప్రధాని మోదీ
నంబాలపై కోటిన్నర రూపాయల రివార్డు!
వరంగల్ ఆర్‌ఈసీలో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీకాకుళం వాసి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్‌జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్ ఆర్‌ఈసీ (ఇప్పటి నిట్)లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు.
పక్కా సమాచారంతో..
అబూజ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు మాడ్ డివిజన్ సీనియర్ కేడర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల డీఆర్‌జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి.
ఈ కాల్పుల్లో మధు, నవీన్ అనే డివిజన్ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, నవీన్ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా..
గతనెల 18న నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్‌టాప్‌లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్ 21న తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్‌తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్ ముగిసేసరికి వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్‌లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని..
డంప్‌లో లభించిన ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది.
అంత ఈజీగా ఎలా?
సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది.
ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది.