 
													పీసీసీ చీఫ్ పెద్ద బాధ్యతే
42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్ సిటీ: ఉప ముఖ్యమంత్రి పదవిపై తనకు అస్సలు ఆశ లేదని.. పీసీసీ చీఫ్‌గా చాలా సంతృప్తిగా ఉన్నానని మహేశ్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ పదవి బరువు బాధ్యతలతో కూడుకున్న చాలా పెద్దదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మాజీ ఎంపీ అజహరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోకుండా బీజేపీ అడ్డుపడుతోందని ఆయన మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు.
డిసెంబర్‌లో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు మహేశ్‌గౌడ్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కె నగేశ్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, రాజమహేందర్, జావేద్ అక్రం తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
