మీది గొప్ప పోరాటం

Maharashtra Cm Uddhav Thackeray Phone Call To Cm Kcr Support For Against Bjp - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహారాష్ట్ర సీఎం ఠాక్రే ప్రశంస

కేంద్రంపై పోరుకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు వెల్లడి

20న ముంబై రావాలంటూ కేసీఆర్‌కు ఫోన్లో ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరిస్తోందంటూ గళం విప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు క్రమంగా వివిధ రాష్ట్రాల సీఎంల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ సీఎం కేసీఆర్‌కు అండగా నిలవగా తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సైతం కేసీఆర్‌కు మద్దతు పలికారు.

దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవ డానికి సరైన సమయంలో గళం విప్పారంటూ కేసీఆర్‌ను ప్రశంసించారు. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఠాక్రే బుధవారం సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. ఈ నెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. ‘‘కేసీఆర్‌జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొన సాగించండి.

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఠాక్రే ఆహ్వానం మేరకు 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముంబై వెళ్లనున్నారు. ఈ భేటీలో కేంద్రంపై ఏ విధమైన పోరాట పంథాను అనుసరించాలనే అంశంపై ఇరువురు నేతలు చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఈ సమావేశంలో ఏదైనా కార్యాచరణ రూపొందుతుందా అనేది తెలియాల్సి ఉంది. 

      

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top