
మాగంటి సునీతకు బీఫామ్ అందజేస్తున్న కేసీఆర్. చిత్రంలో సబిత, పద్మారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, భాస్కర్‌రావు తదితరులు
బీఫామ్‌తో పాటు రూ.40 లక్షల చెక్కు ఇచ్చిన కేసీఆర్
19న భారీ ర్యాలీతో మరోమారు నామినేషన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నా రు. హంగూఆర్భాటానికి తావు లేకుండా తొలిసెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు. ఈ నెల 19న మరో సెట్ నామి నేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కాగా మాగంటి సునీత మంగళవారం ఎర్రవల్లి నివా సంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేతుల మీదుగా సునీత బీఫామ్‌ను అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరఫున సునీతకు రూ.40 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు ఉన్నారు.