
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో కేంద్రం నుంచి గ్రాంట్‌లు, కేంద్ర పథకాల నిధులు ఆగిపోయాయి.
దీంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్ది గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం.
8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా
ఈ నెల 8వ తేదీలోగా గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే.