
ట్రెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన బోన్.. వారం క్రితం పోలీస్ గ్రేహౌండ్స్ వెనక వైపు రాతి కొండ పైన కనిపించిన చిరుత.
పోలీస్ క్యాంప్ నుంచి మిలిటరీ క్యాంప్‌నకు తరలినట్లు గుర్తింపు
పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
హైదరాబాద్ నగరవాసులను చిరుత పులి భయపెడుతోంది. అభయారణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చి.. దారి తెలియక అటూ ఇటూ స్థావరాలను మారుస్తూ శివారు ప్రాంతాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటి వరకు రాజేంద్రనగర్ పరిధిలోని అటవీ, పోలీసు శాఖల క్యాంపులలో ఉన్న చిరుతపులి సోమవారం ఏకంగా మిలిటరీ కేంద్రంలోకి దూరింది. దాన్ని పట్టుకునేందుకు పక్షం రోజులుగా అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు.
మొయినాబాద్ మండలం, అజీజ్‌నగర్ గ్రామంలోకి వెళ్లే పాత రోడ్డులో ఉన్న మూలికావనంలో ఈ నెల 9వ తేదీన చిరుతపులి (Leopard) జాడ కనిపించింది. అక్కడి నుంచి ఈ నెల 20వ తేదీన పక్కనే ఉన్న గండిపేట మండలం, మంచిరేవులలోని పోలీస్ గ్రేహౌండ్స్‌లోకి వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ దాన్ని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి సీసీ కెమెరాలు, బోన్‌లను ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయం సమయంలో గ్రేహౌండ్స్‌లో ఓ రోడ్డు దాటుతూ సీసీ కెమరాలో చిక్కింది. ఆ మరుసటి రోజే గ్రే హౌండ్స్ వెనకాల ఉన్న ఓ విల్లా ప్రాజెక్ట్‌లో నివాసితులకు ఓ రాతి గుండుపై కూర్చుని కనిపించింది. ఈ నెల 24వ తేదీన తెల్లవారు జామున ఏకంగా ఔటర్‌రింగ్ రోడ్డు (Outer Ring Road) దాటి సర్వీసు రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన ట్రెక్ పార్క్‌లోకి చేరింది. దాంతో అక్కడా సీసీ కెమరాలు, బోన్‌లను ఏర్పాటు చేశారు.
మరో మారు ప్రయాణం..
మొయినాబాద్ మండలంలోని మూలికా వనం నుంచి మొదలయిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారు జామున రాందేవ్‌గూడలోని మిలట్రీ ఏరియాలోని రోడ్డు దాటి శిక్షణా కేంద్రంలోకి వెల్లింది. అటుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న చిరుతను చూసి 100 నెంబర్‌కు ఫోన్ చేశాడు. దాంతో ఇప్పటి వరకు అటవీశాఖ ట్రెక్‌పార్కులో ఉందనుకున్న చిరుత సోమవారం రంగారెడ్డి జిల్లా పరిధి దాటి హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో మిలట్రీ వారు అలర్ట్ అయి దాన్ని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్
భయాందోళనలో ప్రజలు..
తమ గ్రామాలకు పక్కనే చిరుతపులి సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహింబాగ్, రాందేవ్‌గూడల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
తిరిగి రావాల్సిందే..
మొయినాబాద్ మండల పరిధిలో ఆనవాళ్లు కనిపించిన చిరుతను పట్టుకునేందుకు పక్షం రోజులుగా ప్రయత్నిస్తునే ఉన్నాం. చాలాచోట్ల సీసీ కెమరాలు, బోన్‌లు ఏర్పాటు చేశాం. సోమవారం తెల్లవారుజామున రాందేవ్‌గూడలోని మిలట్రీ ఏరియాలో రోడ్డు దాటి మిలట్రీ క్యాంప్‌లోకి వెళ్లినట్టు సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దానికి అక్కడ అనువైన ప్రాంతం లేదు. కాబట్టి అది తిరిగి ట్రెక్ పార్క్, గ్రేహౌండ్స్ వైపే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి.
– లక్ష్మణ్, అటవీ రేంజ్ అధికారి, చిలుకూరు రేంజ్