బ్రాండ్‌ బాబులు | Sakshi
Sakshi News home page

బ్రాండ్‌ బాబులు

Published Fri, Sep 8 2023 4:13 AM

 latest report of 'Redseer' is revealed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం వివిధ రంగాల్లో విజయం సాధించి, ఆర్థికంగా మరో మెట్టు పైకెదు గుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా వారి అభిరుచులు, ఇష్టాలు మారుతున్నాయి. తదనుగుణంగా ఉన్నత శ్రేణి, అధిక నాణ్యత గల వస్తువులు లేదా అధిక ధరలు కలిగిన ఉత్పత్తుల (ప్రీమియం కన్జమ్షన్‌) కొనుగోలు వైపు వారు మొగ్గు చూపుతున్నారని, అలాంటి వాటిపై వారి ఆసక్తి పెరుగుతోందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థికంగా ఎదుగుతున్న భారతీయులు చేస్తున్న వ్యయం, ఇతర అంశాలను పరిశీలిస్తే ప్రీమియం కన్జమ్షన్‌ వైపు వారి ప్రాధాన్యతలు మారుతున్నట్టుగా అవగతమవుతోందని పేర్కొంటున్నాయి. 2019 నుంచి వ్యక్తిగత వినియోగం (ప్రైవేట్‌ కన్జమ్షన్‌) అనేది అంతకంతకు (కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి, తదనంతర పరిణామాల కారణంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా) వృద్ధి చెందుతోందని, వివిధ కేటగిరీల్లో ఎక్కువగా వ్యయం చేయడం వ్యక్తుల ఆర్థిక పురోభివృద్ధిని సూచిస్తున్నాయని స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ ‘రెడ్‌సీర్‌’తాజా నివేదిక వెల్లడించింది.  

మరికొన్ని ముఖ్యాంశాలు 

  • ఆర్థికంగా ఎదుగుతున్నవర్గాలు.. ట్రావెల్‌–టూరిజం, ఫైనాన్షియల్‌ సర్విసెస్, రిక్రియేషన్, ఇన్సూరెన్స్‌ తదితరాలపై చేసే వ్యయంలో పెరుగుదల చోటు చేసుకుంది. 
  •  నాణ్యమైన విద్య,వ్యక్తిగత వాహనాలు, పర్సనల్‌ కేర్‌ వస్తువులు, ఆహారం, వివిధ రకాల బ్రాండెడ్‌ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. 
  •  ఏప్రిల్, మే, జూన్‌లతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు, చేసిన విమాన ప్రయాణాలు, వివిధ రకాల హైఎండ్‌ వాహనాల కొనుగోళ్లు ప్రైవేట్‌ కన్జమ్షన్‌ తీరును తెలియజేస్తున్నాయి.

సంపద పెరుగుదలను సూచిస్తున్నవినియోగ ధోరణులు 
భారతీయుల దీర్ఘకాలిక వినియోగ ధోరణులు క్రమంగా సంపద పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయి. వినియోగదారుల ప్రవర్తన, వ్యవహారశైలి (కన్జ్యూమర్‌ బిహేవియర్‌) చూస్తుంటే అన్ని విషయాల్లోనూ ఉన్నత శ్రేణి కేటగిరీల వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమౌతోంది.ఇండియా డిజిటల్‌గా ఎదగడంతో పాటు దేశంలో మౌలిక సదుపాయాలు కూడా మెరుగైనందున ఈ దశాబ్దంలో ఈ ప్రత్యేక ప్రయాణం మరింత ముందుకు సాగనుంది. – మృగాంక్‌ గుట్‌గుటియా, రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌
 

 
Advertisement
 
Advertisement