‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ | Lab technician dies under suspicious circumstances | Sakshi
Sakshi News home page

‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’

Jun 6 2026 1:14 PM | Updated on Jun 6 2026 1:35 PM

Lab technician dies under suspicious circumstances

పరకాల: ల్యాబ్‌ టెక్నీషియన్‌ షరిఫోద్దీన్‌ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని తేల్చిన పోలీసులు నిందితుడు టీస్టాల్‌ నిర్వాహకుడు జట్టబోయిన సందీప్‌(31)ను అరెస్ట్‌ చేశారు. షరిఫోద్దీన్‌ భార్యతో నిందితుడికి ఉన్న వివాహేతర సంబంధం వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు పరకాల ఏసీపీ సతీశ్‌బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పరకాలలోని ఓ ఇంట్లో ల్యాబ్‌టెక్నీషియన్‌ ఎండీ షరిఫోద్దీన్‌ అద్దెకు ఉంటున్నాడు. హనుమకొండలోని ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. రోజూ డ్యూటీకి వెళ్లే సమయంలో తన భార్యకు టిఫిన్‌ ఇచ్చిరావాలని సమీపంలోని టీ స్టాల్‌ నిర్వాహకుడు సందీప్‌కు చెప్పేవాడు. 

సందీప్‌ రోజూ వెళ్లి టిఫిన్లు ఇచ్చే క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. చివరికి తను చెప్పకపోయినా సందీప్‌ ఇంటికి వెళ్తున్నట్లు తెలుసుకున్న షరీఫొద్దీన్‌ ఈ నెల2న ఉదయం అతడి దగ్గరికి వెళ్లి ఈ రోజు నీతో మాట్లాడే పని ఉందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాడు. తమ వివాహేతర సంబంధం తెలిసిపోయిందని గ్రహించిన సందీప్‌ అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం షరిఫోద్దీన్‌ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే సందీప్‌ వేరేవ్యక్తి ఫోన్‌ నుంచి వాట్సాప్‌ కాల్‌ చేసి వెల్లంపల్లి రోడ్డులోని ఓ బ్రిక్స్‌ షెడ్డు వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి బయల్దేరిన షరీఫోద్దీన్‌ మార్గమధ్యలో ఓ వైన్స్‌ వద్ద రెండు బీర్లు కొనుక్కొని వెళ్లగా ఇద్దరు కలిసి తాగారు. మళ్లీ అతనే వెళ్లి ఇంకో రెండు బీర్లను తీసుకురాగా వాటిని తాగుతూ ‘నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా’ అంటూ సందీప్‌పై షరీఫోద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్‌ పక్కనే ఉన్న కర్రతో షరీఫోద్దీన్‌ తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు మృతదేహాన్ని అతడి వాహనంపైనే అడ్డుగా పెట్టుకొని రోడ్డు మీదికి తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో పడేసి వెళ్లిపోయాడు. రక్తపు మరకలతో ఉన్న షర్ట్‌ను తన ఇంటి పక్కనున్న బాత్రూం వెనుకాల కాల్చిపడేశాడు. మిగతా దుస్తులను పిండిన దుస్తుల్లో కలిపి హత్య వ్యవహారాన్ని దాచే ప్రయత్నం చేశాడు. మృతుడి సోదరుడు రజాక్‌ ఇది హత్యగా అనుమానిస్తూ విచారణ చేయాలని ఫిర్యాదు చేయడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సందీప్‌ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసును వేగవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ క్రాంతికుమార్, ఎస్‌ఐలు రమేశ్, పవన్, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement