‘ఆరుతడి’తో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

‘ఆరుతడి’తో ఆదాయం

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి

ఖిలా వరంగల్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలపై రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. పూర్తిస్థాయిలో వానలు కురవక పోవడం, భూగరర్భ జలాలు అడుగంటడంతో సాగును లాభసాటిగా మార్చుకోవడం ఇప్పడు రైతుల ముందున్న ఏకై క మార్గం. ఇందుకోసం తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులనిచ్చే పంటల వైపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రత్యామ్నాయ పంటల సాగే మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో మెట్ట పంటల సాగే మంచిదని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు ఒక అడుగు ముందుకేసి రైతులకు కరత్రాలను పంచుతున్నారు. ఎలాంటి పంటలు వేసుకోవాలి, వర్షపాతం ఎంత కావాలి, విత్తన పంట కాలం ఎంత, వాటిని ఎలా సాగు చేసుకోవాలనే అంశాలను వివరిస్తున్నారు.

– భారీగా తగ్గనున్న వరిసాగు..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈ ఏడాది వరి సాగును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి వేయొద్దని సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలు వేయాలని కోరుతున్నారు. గతేడాది వానాకాలంలో 1,25,000 ఎకరాల్లో వరి పంట వేయగా.. ఈసారి బావుల కింద ఈనెల 20 వరకు 9,922 ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఇప్పటికే సుమారు 25 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదు కాగా.. ఆగస్టులో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వరి సాగు లాభసాటి కాదని అధికారులు సూచిస్తున్నారు.

వీటిని సాగు చేయండి..

జూలై 22 నుంచి జూలై 31 వరకు కంది, పెసర, మినుము, అలసంద, ఉలవలు, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, ఆముదం వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు కంది, అలసంద, ఉలవలు అముదం, పొద్దుతిరుగుడు వేయాలి. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 31 వరకు నువ్వులు వేసుకోవాలి. 25 నుంచి 45 రోజుల్లో వచ్చే ఆకుకూరలు తోటకూర, మెంతికూర, కొతిమీర, పాలకూర, ముల్లంగి, 45 నుంచి 70 రోజులో వచ్చే కూరగాయలు బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు వంటి ఆరుతడి పంటలు వేస్తే మంచి ఆదాయం ఉంటుందని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.

నీరు అందుబాటులో ఉంటే..

ఒకవేళ వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, బోరు బావుల్లోకి కావాల్సినంత నీరు చేరితే ఈనెలాఖరు వరకు వరి స్వల్పకాలిక రకాలు వేయాలి. వర్షాలు తక్కువగా ఉంటే వరికి బదులు మొక్కజొన్న హైబ్రిడ్‌ రకాలను వాడాలి. పత్తి విత్తుకునే సమయం ముగిసింది. వర్షాభావ పరిస్థితుల్లో పశుగ్రాసం పంటలు వేయాలని పశుసంవర్థకశాఖ అధికారులు సూచిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో రైతులకు

వ్యవసాయశాఖ అవగాహన

వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి

వేయొద్దని అధికారుల సూచన

తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటల వైపు ప్రోత్సాహం

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడంతో పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఆగస్టు 15లోగా వర్షాలు సమృద్ధిగా కురవకపోతే కరువు ఛాయలు అలుముకున్నట్లే. ఈనెల 31లోపు వరి, కంది తక్కువ విస్తీర్ణంలో, ఆగస్టు 15లోపు ఇతర ప్రత్యామ్నాయ పంటలుసాగు చేసుకోవచ్చు. ఇప్పటికే మొక్కజొన్న సోయా, పత్తి పంటలు గరిష్టంగా సాగయ్యాయి. బోరుబావుల కింద వరి అనుకూలం కాదని రైతులకు చెబుతున్నాం. వరి స్థానంలో మొక్కజొన్న ఇతర ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయాఽధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement