సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులకు కీలక అడుగు పడింది. ఇప్పటికే రూ.203.49 కోట్లతో టెండర్ పిలిచిన ఎయిర్‌పోర్ట్ ఆథారిటీ అధికారులు గురువారం మామునూరు విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అనంతరం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ప్రీ–బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరుగురు బిడ్డర్లు పాల్గొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను ఏఏఐ అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఒకేసారి 820 మంది ప్రయాణికులకు సేవలందించే ఆధునిక టెర్మినల్ భవనం, రన్‌వే పునర్నిర్మాణం, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్ (జీఎస్‌ఈ) ఏరియా, మూడు ఆప్రాన్, లింక్ ట్యాక్సీవేలు, ఐసోలేషన్ బే, పెరీమీటర్ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్ రోడ్డు తదితర పనుల రూపకల్పన, నాణ్యతా ప్రమాణాలు, అమలు విధానాన్ని వివరించినట్లు తెలిసింది. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు బిడ్ దాఖలుకు అవకాశం ఉంటుందని, ఆగస్టు 18న బిడ్ ఓపెన్, సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్ తెరుస్తారని వివరించారు.
ఇప్పటికే ఖరారైన పెరీమీటర్ వాల్ టెండర్
ఇప్పటికే విమానాశ్రయ భద్రత దృష్ట్యా రూ.21 కోట్లతో పెరీమీటర్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మాణానికి టెండర్ ఖరారైంది. అవసరమైన ప్రక్రియలు పూర్తికాగానే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. భూమి రక్షణ, భద్రతా ప్రమాణాల పరిరక్షణలో ఈ పనులు కీలకంగా మారనున్నాయి. అలాగే రూ.270 కోట్ల అంచనా వ్యయంతో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌మాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ మౌలిక సదుపాయాలు, యుటిలిటీ నెట్‌వర్క్‌లు, ఇతర అనుబంధ పనులకు అధికారులు మరో టెండర్‌ను త్వరలోనే పిలవనున్నారు.
రూ.203.49 కోట్ల పనులపై
ఏఏ అధికారుల ప్రజంటేషన్
తొలుత మామునూరు ఎయిర్‌పోర్ట్
స్థల సందర్శన
హనుమకొండలో ప్రీ–బిడ్ మీటింగ్


