కాళోజీ సెంటర్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుల నాయకత్వం కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు అన్నారు. స్పెల్–3 కింద గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లు, గణిత ఉపాధ్యాయులకు మూడు రోజుల జిల్లాస్థాయి సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శంభునిపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ రంగయ్యనాయుడు హాజరై మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ–2020) లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థి కేంద్రిత బోధన, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్), అనుభవాత్మక అభ్యసనం అమలు చేయాలని సూచించారు. అంతేకాకుండా దీక్ష, ఖాన్‌అకాడమీ, ఏఐ వంటి డిజిటల్ వనరులను బోధనలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు బోధనను నిరంతరం పర్యవేక్షించాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ గణిత బోధనలో తార్కిక, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించే వినూత్న పద్ధతులు అమలు చేయాలని కోరారు. శిక్షణలో నాయకత్వ నైపుణ్యాలు, అకడమిక్ మానిటరింగ్, డిజిటల్ లెర్నింగ్, ఎన్‌ఈపీ–2020 అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు, రిసోర్స్‌పర్సన్లు, ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి
రంగయ్యనాయుడు


