న్యూస్‌రీల్
ఇవి అవసరం..
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026
నేడు ప్రకృతి వైద్య గ్రంథ సూచికల ఆవిష్కరణలు
ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎనిమిదో వసంతంలోకి
అడుగు పెట్టనుంది.
రూ.కోట్లలో పసిడి లావాదేవీలు.. నాణ్యత తనిఖీలు శూన్యం
● నిబంధనల అమలులో తూనికలు, కొలతల శాఖ నిర్లక్ష్యం
● బీఐఎస్ దాడులతో మరోసారి వెలుగులోకి వచ్చిన లోపాలు
● టెస్టింగ్ సెంటర్లపై నియంత్రణతో కొనుగోలుదారులకు భరోసా
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్‌లో రూ.కోట్లలో బంగారు ఆభరణాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాల తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖల నిర్లక్ష్యంపై విమర్శలొస్తున్నాయి. బంగారు ఆభరణాల అమ్మకాల్లో బిల్లుల పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల తనిఖీలు, టెస్టింగ్ సెంటర్ల నియంత్రణ వంటి కీలక బాధ్యతలు ఈ శాఖకు ఉన్నా.. వాటి అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై అందరికీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల వరంగల్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు నిర్వహించిన దాడుల్లో హాల్‌మార్క్ లేని రూ.10 కోట్ల విలువైన 7.875 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. నాణ్యత తనిఖీలు, ప్రత్యేక డ్రైవ్‌లు, వినియోగదారుల అవగాహన సదస్సులు కనిపించకపోవడం గమనార్హం.
తనిఖీలు లేవా?
లీగల్ మెట్రాలజీ (జనరల్) రూల్స్–2011లోని రూల్ 9(4) ప్రకారం బంగారం విక్రయించే దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలి. విక్రయ రశీదులో బంగారం స్వచ్ఛత, క్యారెట్ వివరాలు, నికర బంగారం బరువు, రాళ్ల బరువు, ఇతర లోహాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించే బాధ్యత అధికారులదే. అలాగే రూల్ 9(5) ప్రకారం అవసరమైతే బంగారం, వెండి ఆభరణాల నాణ్యతపై పరీక్షలు చేసి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలి. 2011 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నా.. జిల్లాలో ఇప్పటివరకు లీగల్ మెట్రాలజీ శాఖ నగల నాణ్యతపై తనిఖీలు, టెస్టింగ్ నిర్వహించిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి.
నగరంలో 45 టెస్టింగ్ సెంటర్లు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదుల సంఖ్యలో ప్రైవేట్ గోల్డ్ టెస్టింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. వరంగల్‌లో 30, హనుమకొండలో 15 టెస్టింగ్ సెంటర్లు వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్ (ఎక్స్‌ఆర్‌ఎఫ్) యంత్రాల ద్వారా బంగారం స్వచ్ఛతను పరీక్షించి నివేదికలు ఇస్తున్నారు. ఈ కేంద్రాలకు లీగల్ మెట్రాలజీ శాఖ లైసెన్సులు జారీ చేయ డం లేదనే ఆరోపణలున్నాయి. పరికరాల కచ్చితత్వాన్ని తనిఖీ చేయడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా 2013 మే 26న వరంగల్‌లో అప్పటి ప్రాంతీయ డిప్యూటీ కంట్రోలర్ రామ్‌కుమార్ త్వరలో బంగారం స్వచ్ఛత కొలిచే యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 13 సంవత్సరాలు గడుస్తున్నా స్వచ్ఛత పరీక్ష కేంద్రం ఏర్పాటు కాలేదు.
అతిపెద్ద మార్కెట్ వరంగల్..
వరంగల్, హనుమకొండ, కాజీపేటలో సుమారు 500 వరకు చిన్నాపెద్ద బంగారు ఆభరణాల దుకాణాలున్నాయి. సాధారణ రోజుల్లో మొత్తం వ్యాపారం రూ.ఐదు కోట్ల నుంచి రూ.10 కోట్లపైగా ఉంటుంది. శుభ ముహూర్తాలు, అక్షయ తృతీయ, ధనత్రయోదశి, పెళ్లిళ్ల సీజన్‌లో ఈ విక్రయాలు రెట్టింపవుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరంగల్, హనుమకొండతో పాటు మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం ఇక్కడికే వస్తుంటారు. అందుకే వరంగల్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.
జిల్లాస్థాయిలో గోల్డ్ ప్యూరిటీ
టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు.
అన్ని గోల్డ్ టెస్టింగ్ సెంటర్ల
నమోదు, లైసెన్సింగ్.
ఎక్స్‌ఆర్‌ఎఫ్ యంత్రాలకు
కాలానుగుణ క్యాలిబ్రేషన్, ధ్రువీకరణ
జ్యువెలరీ షాపులపై
ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లు.
బిల్లుల్లో నికర బంగారం, రాళ్ల బరువు, స్వచ్ఛత వివరాల పరిశీలన.
వినియోగదారుల ఫిర్యాదులపై
వేగవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ


