టీఆర్‌ఎస్‌ నుంచి కుంట శ్రీనివాస్‌ సస్పెండ్‌

kunta srinivas Suspended From TRS Involved In Murder Case - Sakshi

పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు

సాక్షి, కరీంనగర్‌ : న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్‌పై టీఆర్‌ఎస్‌ పార్టీ చర్యలకు ఆదేశించింది. శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్‌ మంథని మండలాధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాద దంపతుల దారుణ హత్య వ్యహహారంలో కుంట శ్రీనివాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. వామన్‌రావు మరణ వాగ్మూలంలోనూ ఆయన పేరునే ప్రస్తావించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీపై, శ్రీనివాస్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు వ్యవహారంలో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్పందించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం అతనిపై వేటు వేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం .శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో నిందితుడు కుంట శ్రీనివాస్‌ (హత్యకు కొన్ని గంటల ముందు) 
గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంట శ్రీనివాస్‌.. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎంపీటీసీగా ఉన్నప్పటి నుంచే వామన్‌రావుతో విభేదాలున్నాయి. ఇటీవల శ్రీనివాస్‌కు చెందిన ఇంటి నిర్మాణంపై వామన్‌రావు ఫిర్యాదుచేసి, పనులను నిలిపివేయించారు. అలాగే గుంజపడుగులోని రామస్వామి గోపాలస్వామి దేవాలయ నిర్వహణ దశాబ్దాలుగా వామన్‌రావు కుటుంబసభ్యులే చేసుకుంటుండగా.. కొందరు మరో కమిటీని ఏర్పాటుచేసి గుడికి చెందిన పనులు చేస్తున్నారు. దీనిపై వామన్‌రావు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదుచేసి, ఆ పనులు కూడా నిలిపివేయించారు. గుంజపడుగు చెరువు శిఖం భూమిలో అనుమతి లేకుండా పెద్దమ్మ గుడి నిర్మాణం చేపడుతున్నారని ఆయన పంచాయతీకి ఫిర్యాదు చేశారు. ఆ పనులు కూడా ఆగిపోయాయి. దీంతో గ్రామంలో తమకు అడ్డు వస్తున్నారనే కక్షతోనే శ్రీనివాస్‌ తదితరులు ఈ దారుణానికి పాల్పడ్డారని వామన్‌రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top