
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక సంస్థలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘ఇవాంటి’ కార్యకలాపాలను గురువారం ప్రారంభించిన ఆయన సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుల్లో హైదరాబాద్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రముఖ సాంకేతిక కంపెనీలకు గమ్యస్థానంగా నగరం మారుతోందన్న ఆయన, వాటి సరసన ‘ఇవాంటి’చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఏడు వందల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించిన ‘ఇవాంటి’రాబోయే రోజుల్లో మూడు రెట్ల ఉద్యోగులను నియమించాలని లక్ష్యంగా పెట్టుకోవడం హర్షణీయమన్నారు. భారత్ ఓ వైపు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నా, సైబర్ ముప్పు ద్వారా సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు.