ఆ మీడియాలకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు | Sakshi
Sakshi News home page

ఆ మీడియాలకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

Published Sun, Mar 31 2024 1:40 AM

KTR legal notices to those media - Sakshi

దుష్ప్రచారం చేస్తున్న టీవీ, సోషల్‌ మీడియాతో సహా 10 సంస్థలకు తాఖీదులు

గతంలోనే కొన్ని సంస్థలకు లీగల్‌ నోటీసులు పంపిన కేటీఆర్‌

దుష్ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: కుట్రతో తనపైన, తన కుటుంబంపైన అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ చానళ్లతో పాటు యూట్యూబ్‌ సంస్థలు, సోషల్‌ మీడియా సంస్థలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు శనివరం లీగల్‌ నోటీసులు పంపించారు.

పక్కా ప్రణాళికతో తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలనే దురుద్దేశంతోనే ఈ చానళ్లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆయన తాను పంపిన లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు.

మీడియా ముసుగులో పక్కా ఎజెండాతో సాగిస్తున్న కుట్రలో భాగంగా తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేర్లను, ఫొటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్‌ నెయిల్స్‌ పెడుతూ పబ్బం గడుపుకొంటున్నారని, ఈ చానళ్లపై తగిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

వెంటనే ఆ వీడియోలను తొలగించండి
తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్‌ చానళ్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్‌ చానల్స్‌ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని, అలాంటి వీడియోలను, కంటెంట్‌ను తీసివేసినట్లు చెప్పాయని కేటీఆర్‌ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా చానళ్లు, యూట్యూబ్‌ చానల్స్‌ ఇలాంటి కంటెంట్‌ ని తీసివేయకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. 

యూట్యూబ్‌కి సైతం నోటీసులు
కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్‌కి సైతం లీగల్‌ నోటీసులు పంపించామని కేటీఆర్‌ తెలిపారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్‌ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement