కొండా సురేఖ వివాదంపై నాగార్జున కీలక నిర్ణయం | Konda Surekha Withdraws Remarks Against Nagarjuna Amid Defamation Case | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ వివాదంపై నాగార్జున కీలక నిర్ణయం

Nov 13 2025 6:12 PM | Updated on Nov 13 2025 6:54 PM

Konda Surekha Withdraws Remarks Against Nagarjuna Amid Defamation Case

సాక్షి,హైదరాబాద్‌: మంత్రి  కొండా సురేఖపై టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు.  

గతేడాది ఓ మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యుల్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మా కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయి. అందుకే భారత శిక్షా స్మృతి (BNS) సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’ అని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కోర్టులో విచారణ కొనసాగుతుండగా.. కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా అక్కినేని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ, అవి బాధ కలిగించాయని అంగీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో నాగార్జున తన దావాను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకున్నారు. కొండా సురేఖ, నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసినట్లైంది. 

పరువు నష్టం దావా కేసు విచారణ ముందు రోజు మంత్రి కొండా సురేఖ ‘ఎక్స్‌’ వేదికగా అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలని నేను మాట్లాడలేదు. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది నా ఉద్దేశమే కాదు. ఆయన కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో పొరపాటు ఉంటే చింతిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా’అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement