మూడు గ్రూపులు..ఆరు వర్గాలు!  | Khammam District Turned Into Headache For TRS Party | Sakshi
Sakshi News home page

మూడు గ్రూపులు..ఆరు వర్గాలు! 

Apr 15 2022 4:28 AM | Updated on Apr 15 2022 3:33 PM

Khammam District Turned Into Headache For TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామమాత్ర ప్రభావమే చూపుతూ వస్తున్న టీఆర్‌ఎస్, అక్కడి రాజకీయాలపై పట్టు సాధించేందుకు ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వస్తోంది. అధినేత కేసీఆర్‌ ఎత్తుగడలు ఫలితాన్నిస్తున్నా.. పార్టీ ముఖ్య నేతలు ఎవరికి వారుగా తమ సొంత నియోజకవర్గం లేదా జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి.

పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్కో చోట మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి గెలుపొందిన వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని బలం పెంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయితే ఇలా చేరిన ఎమ్మెల్యేలు, ఓటమి పాలైన పార్టీ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. 

ఎవరికి వారే యమునా తీరే..  
ఇన్నాళ్లూ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో.. కొత్తగా మరో ఇద్దరు నాయకులు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి హోదాలో పువ్వాడ అజయ్‌ చురుగ్గా వ్యవహరిస్తుండటం, పార్టీ కార్యకలాపాలను, నేతలను సమన్వయం చేయడంలో క్రియాశీలంగా ఉండటం కొందరు నేతలకు కంటగింపుగా ఉందని తెలుస్తోంది.

మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పాలేరు నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని చాటు కునేందుకు ఎప్పటికప్పుడు సొంత కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొంగులేటి విషయానికొస్తే.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని పక్కన పెడితే పోటీ చేసేది మాత్రం ఖాయమని తెగేసి చెప్తున్నారు. అయితే కొత్తగా ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎంపికైన ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగ కాంతారావు తాము బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు తమ కనుసన్నల్లోనే జరగాలని ఆదేశిస్తున్నారు. 

ఒకే పార్టీలో ఓడిన అభ్యర్థులు, విజేతలు!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటమి పాలైన మా జీ ఎమ్మెల్యేలు, ఆయా స్థానాల్లో వివిధ పార్టీల నుంచి గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన ఎ మ్మెల్యేలు ఒకే పార్టీలో కొనసాగుతుండటం కూడా పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యం లో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్‌రావు ఒక్కరే గెలుపొందగా, ఇతర టీఆర్‌ఎస్‌ అభ్యర్థులెవరూ కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేదు.

తర్వాత ఇతర పార్టీల నుంచి గెలుపొందిన పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్, బానోత్‌ మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ ఒక్కరే గెలుపొందగా, మిగతా అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. ఇతర పార్టీల నుంచి గెలుపొందిన రేగ కాంతారావు, హరిప్రియ భానోత్, ఉపేందర్‌రెడ్డి, లావుడ్యా రాములు, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంక టేశ్వర్‌రావు, మెచ్చా నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో  ప్రత్యర్థులుగా తలప డి గెలిచిన, ఓడిన నేతలు ప్రస్తుతం ఒకే పార్టీలో కొనసాగుతుండటంతో అన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. 

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటీఆర్‌ 
పార్టీలో అంతర్గత విభేదాలను చక్కదిద్దే బాధ్యతను సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌కు, అప్పగించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16న ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న కేటీఆర్‌ ఈ సందర్భంగా పార్టీ నేతలతోనూ సమావేశమవుతారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement