2014లో ఆర్‌ఎస్‌ఓ టెర్రరిస్ట్ ఖాలీద్ మహ్మద్ యత్నం.. అప్పట్లోశంషాబాద్ ప్రాంతంలో ప్రయోగశాల ఏర్పాటు
తాజాగా డాక్టర్ మెయినుద్దీన్ తో మరోసారి తెరపైకి..
నేడు హైదరాబాద్‌కు రానున్న అహ్మదాబాద్‌ఏటీఎస్ టీమ్
సాక్షి, హైదరాబాద్: బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులకు మాత్రమే పరిమితమైన ఉగ్రవాదులు విష ప్రయోగాల వైపు మొగ్గు చూపుతున్నారా..? అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదాకే పరిమితమైన ఇలాంటి కుట్రలు ఇతర సంస్థలకూ పాకుతున్నాయా? అవుననే అంటున్నాయి నిఘా సంస్థలు.
2014లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రోహింగ్యా సాలిడేటరీ ఆర్గనైజేషన్‌కు (ఆర్‌ఎస్‌ఓ) చెందిన ఉగ్రవాది ఖాలీద్ మహ్మద్ విచారణ.. ఇస్లామిక్ స్టేట్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్‌కేపీ) మాడ్యూల్‌లో పనిచేస్తూ ఇటీవల అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)కు చిక్కిన హైదరాబాదీ డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ విచారణలో బయటపడిన అంశాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
వైద్యరంగం, ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్స్
బయో టెర్రరిజంలోభాగమైన ఇలాంటి విష ప్రయోగాలు సాధారణ వ్యక్తులతో సాధ్యం కాదు. ఆయారంగాలపై పట్టు, అనుభవం ఉండాలి. ఈ నేపథ్యంలో ఉగ్ర సంస్థలు ఎంపిక చేసుకుంటున్న వారిలో వైద్య, ఫార్మసీ రంగాలకు చెందిన వాళ్లే ఉంటున్నారు. అప్పట్లో అరెస్టయిన ఖాలీద్ స్వస్థలం మయన్మార్ కాగా అతగాడు బీఫార్మసీ చదివాడు.
బంగ్లాదేశ్–మయన్మార్ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్‌కు (టీటీపీ) చెందిన ట్రైనర్లు ఖాలీద్‌కు శిక్షణ ఇచ్చారు. తాజాగా చిక్కిన మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఓ షవార్మా సెంటర్ కూడా నిర్వహించాడు.
ప్రయోగశాలలు ఏర్పాటు చేసుకుని..
ఖాలీద్ 2013 నవంబర్ 27 నుంచి హైదరాబాద్ శివార్లలోని రాయల్ కాలనీలో శరణార్థుల ముసుగులో కుటుంబంతో కలిసి నివసించాడు. స్థానికంగా ట్యూషన్ టీచర్‌గా చెలామణి కాగా, అతడి తల్లి, భార్య ఓ ఇటుకల బట్టీలో పని చేశారు. ఆహార పదార్థాలతోపాటు మంచినీటిసరఫరా వ్యవస్థల్లోనూ విషాన్ని కలపడం ద్వారా భారీగా అమాయకుల్ని, టార్గెట్ చేసుకున్న వారిని హతం చేయాలని ఖాలీద్ పథకం వేశాడు.
వాటి తయారీకి శంషాబాద్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని ప్రయోగశాల ఏర్పాటు చేశాడు. కాగా, మొయినుద్దీన్ ఆముదం గింజల నుంచి రిసిన్ అనే విషాన్ని తీసి ఆహార మార్కెట్లలో ప్రయోగించాలని భావించాడు. రిసిన్ తయారీ కోసం రాజేంద్రనగర్‌లోని తన ఇంట్లోనే ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నాడు.
నాలుగోసారి ఏటీఎస్ బృందం
అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు మొయినుద్దీన్ అరెస్టు తర్వాత మూడుసార్లు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. రాజేంద్రనగర్‌లోని అతడి ఇంటితో పాటు షవర్మా సెంటర్‌లోనూ సోదాలు చేసి రిసిన్‌తోపాటు దాని తయారీకి అవసరమైన రసాయనాలు, ఆముదం గింజలను స్వాదీనం చేసుకున్నారు.
పోలీసు కస్టడీలో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా మరికొన్ని అంశాలు సరిచూడాలని ఏటీఎస్ భావిస్తోంది. దీనికోసం గురువారం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అహ్మదాబాద్ వెళ్లి మొయినుద్దీన్, అతడితోపాటు అరెస్టయిన ఇద్దరు ఐఎస్‌కేపీ ఉగ్రవాదుల్ని ప్రశ్నించారు.
సబర్మతి జైల్లో మొయినుద్దీన్‌పై దాడి
ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మొయినుద్దీన్‌పై బుధవారం ఉదయం దాడి జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఈ ‘హై రిస్‌్క’ఖైదీపై జైల్లోనే ఇలా జరగడంతో జైలు అధికారులతోపాటు ఏటీఎస్ పోలీసులూ ఉలిక్కిపడ్డారు. మొయినుద్దీన్ ఉంటున్న బ్యారక్‌లో మరో ముగ్గురూ ఉన్నారు.
బుధవారం ఉదయం ఇతడితో వాగ్వాదానికి దిగిన ఆ త్రయం కింద పడేసి దాడి చేసింది. దీనికోసం బెల్ట్/బకెల్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొయినుద్దీన్ కన్ను, ముఖంతోపాటు శరీరంపై అనేక చోట్ల గాయాలయ్యాయి. కొన్ని తీవ్రంగా ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం సబర్మతి జైలు నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి చేసింది అతడితోపాటు అరెస్టయిన ఉత్తరప్రదేశ్ వాసులే అని తెలుస్తోంది.


